దేశ రక్షణలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. కాగా... తనకు పుట్టిన బిడ్డ ముఖం కూడా కనీసం చూడకుండానే అతను ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ విషాదకర సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

‌బీహార్‌లోని భోజ్‌పూర్‌కు చెందిన ఒక జ‌వాను దేశ ర‌క్ష‌ణ‌లో అసువులుబాసి అమ‌రుడ‌య్యాడు, బిహియా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ప‌హ‌ర్‌పూర్ గ్రామానికి చెందిన కుంద‌న్ ఓఝా(28) సైన్యంలో ప‌నిచేస్తున్నాడు. కుంద‌న్ ఓఝా అమ‌రుడ‌య్యాడ‌ని తెలియ‌గానే గ్రామంలో విషాదం అల‌ముకుంది. 

రైతు ర‌విశంక‌ర్ కుమారుడైన కుంద‌న్ ప‌దేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. రెండేళ్ల క్రిత‌మే అత‌నికి వివాహ‌మ‌య్యింది. 20 రోజుల క్రిత‌మే అత‌నికి కుమార్తె పుట్టింది. దీంతో వారి కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కుంద‌న్‌కు ముగ్గురు సోద‌రులున్నారు. 

వారి బాధ్య‌త‌ను కూడా కుంద‌న్ నెర‌వేర్చేవాడు. కుమార్తెను చూసేందుకు వస్తాడ‌నుకుంటున్న స‌మ‌యంలో కుంద‌న్ గురించి ఇలాంటి వార్త వినాల్సి రావ‌డాన్ని కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.