ఉక్రెయిన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు రష్యా దాడి చేస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలోని భారత ఎంబసీ మన దేశ పౌరులను అలర్ట్ చేసింది. భారత పౌరులు, విద్యార్థులు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. అక్కడ ఉండక తప్పనివారు ఎంబసీకి కాంటాక్ట్‌లో ఉండాలని వివరించింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine) దేశాన్ని రష్యా(Russia) ఆక్రమించుకోబోతున్నదనే(Invasion) ఆందోళనకర అంచనాలతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే రష్యా భారీగా బలగాలను మోహరించినట్టు కథనాలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగొచ్చని, రష్యా క్షిపణులతో విరుచుకుపడవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత(India) ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులను(Indian Students) అప్రమత్తం చేసింది. ఆ దేశంలోని విద్యార్థులు, పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని తెలిపింది.
ఉక్రెయిన్ దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని, వీటి దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలోని భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ పిలుపు ఇచ్చింది. తాత్కాలికంగా ఆ దేశం విడిచి వచ్చేయాలని తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌లోనే ఉండక తప్పని పరిస్థితి ఉన్న పౌరులు తమ ఉనికిని ఎప్పటికప్పుడు ఎంబస్సీకి సమాచారం ఇవ్వాలని వివరించింది. ఉక్రెయిన్‌లో వారు ఎక్కడ ఉంటున్నారో సమాచారం ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అవసరమైనప్పుడు ఎంబసీ వారిని అనుసంధానంలోకి తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికైతే.. ఉక్రెయిన్‌లోని భారత ఎంబస్సీ పౌరులకు అన్ని సేవలను అందిస్తున్నదని వివరించింది.
అమెరికా కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌లో తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది. అంతేకాదు, ఆ దేశంలోని యూఎస్ ఎంబస్సీ ఆపరేషన్స్‌ను ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి పశ్చిమ నగరం ల్వీవ్‌కు తరలించింది. ఈ విషయాన్ని అమెరికానే వెల్లడించింది రష్యా బలగాలు ఆందోళనకర పరిస్థితులను కల్పిస్తున్నదని తెలిపింది. ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దు వైపునకు సుమారు లక్షకు పైగా ట్రూపులను రష్యా తరలించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై ఏ సమయంలోనైనా దాడి చేయవచ్చని ఆరోపించింది. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నదని పశ్చిమ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక వేళ రష్యా దేశం.. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా.. దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. దౌత్యానికి దారులు తెరిచే ఉన్నాయని వివరించారు.
ఉక్రెయిన్ ప్రస్తుతం నాటో ఇండివిడ్యువల్ పార్ట్‌నర్షిప్ యాక్షన్ ప్లాన్‌లో సభ్యురాలిగా ఉన్నది. ఈ ప్లాన్‌లో సభ్య దేశమైన ఉక్రెయిన్ పశ్చిమ దేశాల నాటోతో నిరంతరం సంభాషణలు నిర్వహించుకోవచ్చు. కానీ, ఈ యాక్షన్ ప్లాన్‌లో సభ్యత్వం తీసుకున్న ఉక్రెయిన్ భవిష్యత్‌లో శాశ్వత సభ్య దేశంగా మారవచ్చని రష్యా దేశం భయపడుతున్నది. ఈ యాక్షన్ ప్లాన్‌లో ఉన్నందున నాటో కూటమి ఉక్రెయిన్‌ను కాపాడే బాధ్యత ఏమీ ఉండదు. కానీ, క్రిమియాతో రష్యా చరిత్ర.. ఉక్రెయిన్ దేశం ఉన్న వ్యూహాత్మక లొకేషన్ కలిగి ఉండటంపై పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. పశ్చిమ దేశాల ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నించుకుంటున్నాయి.
తూర్పు యూరప్‌లో నాటో కూటమి వెంటనే అన్ని సైనిక చర్యలను ముగించాలని గతేడాది డిసెంబర్‌లో రష్యా డిమాండ్ చేసింది. పొలాండ్, బాల్టిక్ దేశాల్లోనూ నాటో బెటాలియన్లను ఉపసంహరించాలని పేర్కొంది. అంతేకాదు, నాటో కూటమి.. ఉక్రెయిన్‌ను ఎప్పుడూ శాశ్వత సభ్య దేశంగా స్వీకరించారదని స్పష్టం చేసింది. నాటో లేదా ఇతర సంస్థల ద్వారా.. ఇతర మార్గాల ద్వారానైనా పశ్చిమ దేశాలు.. తూర్పు వైపున వ్యాపించరాదని, ఇందుకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
