ఢిల్లీ : చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్‌–పాక్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాసిన లేఖకు స్పందించిన భారత ప్రభుత్వం తొలుత సానుకూలంగా స్పందించినా ఆ తర్వాత తిరస్కరించింది. కశ్మీర్‌ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, ముగ్గురు ఎస్పీవోలను పాక్‌ దారుణంగా హతమార్చిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. 

ఈ నెలాఖరున ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా భారత్‌, పాక్‌ దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్‌, షా ఖురేషీలు న్యూయార్క్ లో సమావేశం అవుతారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అయితే  రావీష్ కుమార్ ప్రకటన వెలువడి 24 గంటలు కాకముందే చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో చర్చకు ససేమిరా అంది.  

రామ్‌గడ్‌ సెక్టారులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను తూటలు దించి, గొంతుకోసి అత్యంత  దారుణంగా హత్యచేశారు. ఆ ఘటన మరువకముందే షోపియాన్‌ జిల్లాలో ముగ్గురు పోలీసుల ఇళ్లల్లోకి చొరబడి వారిని కిడ్నాప్‌ చేశారు. ఆతర్వాత వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 

బుల్లెట్‌ గాయాలతో ఉన్న పోలీసుల మృతదేహాలను భద్రతాసిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో పాక్ తో శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సరిహద్దులో పాక్‌ చర్యలకు తూటాలతోనే సమాధానం చెప్తామని ఇటీవలే భారత సైన్యం ప్రకటించింది. 

పాకిస్తాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే లేఖ రాశారు. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. మోదీ లేఖపై స్పందించిన ఇమ్రాన్ ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. 

ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్‌ లేఖ రాశారు. భారత్‌, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్‌ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు.  

రెండు దేశాల మధ్య పరస్పరం శాంతిని కాంక్షిస్తూ ప్రజలకు, ప్రధానంగా భవిష్యత్తు తరాల కోసం ఉభయ తారకంగా చర్చలు జరుపుదాం. అంతరాలను తగ్గించుకుందాం అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత ప్రధాని మోదీని కోరారు. అయితే న్యూయార్క్ లో ఇరుదేశాలు భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేందుకు భారత్ అంగీకరించింది. అయితే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో  భారత్ వెనక్కి తగ్గింది.