భారత్ విశ్వగురువుగా ఆవిష్కరించడానికి మన దేవుళ్లే కారణం అని యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి అన్నారు. ఈ దేవుళ్లు భారత్‌కు అస్తిత్వం అని పేర్కొన్నారు. కాబట్టి, ఎవ్వరైనా దేవుడికి సంబంధించి ప్రాంతాలను సుందరీకరించడానికి ప్రయత్నిస్తే.. అభ్యంతరపెట్టవద్దని వివరించారు. 

లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని షాహి ఈద్గాలపై కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం మన దేవుళ్ల వల్లే విశ్వగురువుగా అవతరించిందని అన్నారు. అంతేకాదు, ఈ దేవుళ్ల భారత దేశానికి గుర్తింపు అని వివరించారు.

కాబట్టి, ఏ ప్రభుత్వమైనా, ఏ కమ్యూనిటీ, సంస్థ అయినా.. దేవుడికి సంబంధించిన ప్రాంతాలను సుందరీకరణ చేయాలని ముందుకు వస్తే ఎవరూ అభ్యంతరాలు చెప్పకూడదని పేర్కొన్నారు. అయోధ్య నగరం రాముడి జన్మస్థలం, మధుర కృష్ణుడు పుట్టిన ప్రాంతం, కాశీని సృష్టించిందే శివుడు. ఈ దేవుళ్ల కారణంగానే భారత్‌కు ఈ గుర్తింపు ఉన్నది. ఈ దేవుళ్ల వల్లే భారత్ విశ్వగురువుగా అవతరించింది అని ఉత్తరప్రదేశ్ చెరుకు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి వివరించారు.

నేడు ప్రపంచమే భగవద్గీత చదువుతున్నదని ఆయన అన్నారు. కృష్ణడు.. అర్జునుడికి చెప్పిన పాఠాల నుంచి ప్రపంచమే సందేశాన్ని పొందుతున్నదని వివరించారు. భగవాన్ రాముడి నుంచి ఒక ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన భర్త, ఆదర్శవంతమైన సోదరుడు, ఆదర్శవంతమైన స్నేహితుడు ఎలా ఉండాలా? అని నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, 800 నుంచి 850 ఏళ్ల నుంచి నాశనం చేస్తున్న మన భారత సంస్కృతిని మళ్లీ కాపాడుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని మంత్రి వివరించారు.

జ్ఞానవాపి మసీదు విషయంపై మాట్లాడటానికి ఆయన తిరస్కరించారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నదని దాటవేశారు.

కాగా, ప్రత్యర్థి శిబిర రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి ఆదివారం ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. జ్ఞానవాపి మసీదుపై జరుగుతున్న వ్యవహారాన్ని ఆధునిక ప్రజాస్వామిక భారత్ అసలు పట్టించుకోవద్దని అన్నారు. చట్టం కోణంలో చూస్తే.. ఈ విషయంపై చర్చనూ అనుమతించడం సరికాదని తెలిపారు. ఆధునిక ప్రజాస్వామిక భారత చట్టాలు ఈ అంశంపై చర్చను అనుమతించవని చెప్పారు. గతాన్ని ఒక మినహాయింపుగా తీసుకుని భవిష్యత్తును గందరగోళ పరిచే పనులు చేయవద్దని అన్నారు. నిజమైన భారత దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు.