తెహ్రీక్-ఇ-హురియత్ పై భారత్ నిషేధం.. ఎందుకంటే ?
Tehreek-e-Hurriyat : జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు తెహ్రీక్-ఇ-హురియత్ (టీఈహెచ్)ను భారత ప్రభుత్వం నిషేధించింది. యూఏపీఏ కింద దానిని నిషేధిత సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
Tehreek-e-Hurriyat ban : చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద తెహ్రీక్-ఇ-హురియత్ (టీఈహెచ్)ను 'చట్టవ్యతిరేక సంఘం'గా కేంద్రం ప్రకటించింది. జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు ఆదివారం దానిని భారత ప్రభుత్వం నిషేధించింది. గతంలో ఈ సంస్థకు దివంగత వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించారు.
ఈ సంస్థ జమ్ముకాశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు నిషేధిత కార్యకలాపాలకు పాల్పడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఈ సంస్థ భారత వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆరోపించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలభిస్తోందని అన్నారు. అందులో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఏ వ్యక్తి లేదా సంస్థనైనా తక్షణమే అడ్డుకుంటామని అమిత్ షా తెలిపారు. కాగా.. ఇటీవలే ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) (ఎంఎల్జెకె-ఎంఎ)ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ సంస్థ కూడా జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, జమ్మూ కాశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం తెలిపింది.
మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ఎంఎల్జేకే-ఎంఏ భారత్ వ్యతిరేక, పాక్ అనుకూల ప్రచారంలో పాల్గొన్నందుకు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ నుంచి జమ్మూకాశ్మీర్ కు వేరు చేయడం, పాకిస్థాన్ లో విలీనాన్ని సాకారం చేయడం, జమ్మూకాశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ను స్థాపించడం ఈ సంస్థ లక్ష్యమని కేంద్ర హోంశాఖ తెలిపింది.
కాగా.. మొదట తెహ్రీక్-ఇ-హురియత్ కు వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు. అతడు మరణించిన అనంతరం ఆ సంస్థ బాధ్యతలను మసరత్ ఆలం భట్ తీసుకున్నాడు. అతడు భారత వ్యతిరేకి, పాకిస్తాన్ అనుకూల ప్రచారానికి కూడా ప్రసిద్ధి చెందారు. అయితే అతడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.