బెంగళూరు: జెడిఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల లోపలే కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు శాసనసభ్యులపై ఆయన అనర్హత వేటు వేశారు. స్వతంత్ర శాసనసభ్యుడు ఆర్ శంకర్ పై, మరో ఇద్దరిపై ఆయన అనర్హత వేటు వేశారు. 

తిరుగుబాటు కాంగ్రెసు శాసనసభ్యులు రమేష్ జర్కిహోళీ, మహేష్ కుమతళ్లిలను కూడా స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు ఫిరాయింపుల నిరోధక చట్టం పదో షెడ్యూల్ కింద ఆయన వారిని అనర్హులుగా ప్రకటించారు. వారిపై అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. 

కెపిజెపి టికెట్ పై శాసనసభకు ఎన్నికైన ఆర్ శంకర్ తన పార్టీ కాంగ్రెసులో విలీనమైనట్లు ఈ ఏడాది జూన్ 14వ తేదీన తెలిపారని, కాంగ్రెసు శాసనసభ పక్ష (సిఎల్పీ) నేత సిద్ధరామయ్య అదే రోజు కెపిజెపి తమ పార్టీలో విలీనమైనట్లు ధ్రువీకరిస్తూ తనకు లేఖ రాశారని ఆయన చెప్పారు. ఆ విలీన ప్రక్రియ జూన్ 25వ తేదీతో పూర్తయిందని స్పీకర్ తెలిపారు