భవానీపూర్ ఉపఎన్నికలో పరాజయాన్ని బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ అంగీకరించారు. అయితే, గతంలో దీదీ విసిరిన సవాల్‌ను ఆమె నిలుపుకోలేకపోయారని కామెంట్ చేశారు. తాను భవానీపూర్ ప్రజలకు రుణపడి ఉన్నానని మమతా బెనర్జీ అన్నారు. 

కోల్‌కతా: భవానీపూర్ ఉపఎన్నికలో సీఎం మమతా బెనర్జీ అఖండ విజయం సాధించారు. 58వేల ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. కాగా, బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ ఓటమిని అంగీకరించారు. అయితే, మమతా బెనర్జీ తనపై ఒక లక్ష ఓట్లతో గెలుస్తారని బీరాలు పలికారని, అది ఆమెకు సాధ్యం కాలేదని అన్నారు. అంతేకాదు.. ఈ గేమ్‌లో తానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రకటించుకున్నారు. మమతా బెనర్జీ కంచుకోట నుంచి పోటీ చేశారని, అయినప్పటికీ తనకు 25వేల ఓట్లు పడ్డాయని అన్నారు. ఇలాగే ఇకపైనా తన కృషి కొనసాగుతుందన్నారు. ఉపఎన్నికలో విజయం తర్వాత మమతా బెనర్జీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

భవానీపూర్ ప్రజలు మళ్లీ తననే ఆశీర్వదించారని మమతా బెనర్జీ అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటారని తెలిపారు. ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు చేశారని తెలిపారు. కానీ, వాటన్నింటినీ ప్రజలు తెలివిగా అర్థం చేసుకున్నారని వివరించారు. అందుకే తనకు అఖండ మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. నందిగ్రామ్‌లోనూ తాను ఓడిపోవడం వెనుక ఎన్నో కుట్రలు ఉన్నాయని, అవన్నీ చెబుతారని అన్నారు.

భవానీపూర్‌లో తాను గతంలో గెలిచినప్పుడు ఇంతటి మెజార్టీ రాలేదని దీదీ అన్నారు. ఈ సారి 58వేల మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. భవానీపూర్‌లో 46శాతం ప్రజలు బెంగాళీయేతరులని తెలిపారు. వారంతా తనకే ఓటేశారని అన్నారు. ప్రతివాడలోనూ తామే విజయం సాధించామని చెప్పారు.

కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌లోనూ మమతా బెనర్జీ ఆధిక్యం చూపిస్తూ వచ్చారు. చివరకు 58వేల చిలుకు ఓట్లతో ప్రత్యర్థి ప్రియాంక తబ్రేవాల్‌పై విజయం సాధించారు. మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలో గెలుపు ఆమెకు అనివార్యం. ఇప్పటికే బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోతుందన్నంత పోటీ నెలకొని ఉన్నది. గత అసెంబ్లీ ఎన్ినకల్లోనే ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికపై దేశమంతా చూపు సారించింది. గత అసెంబ్లీ ఎన్నికలో సువేందు అధికారిపై మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఆరు నెలల్లోపు ఆమె శాసనసభలో అడుగుపెట్టాల్సి ఉంది. అందుకే భవానీపూర్ ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికలోనూ ఆమె గెలుపొంది మమతా బెనర్జీ తన జైత్రయాత్రను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.