పెరుగుతున్న కరోనావైరస్ వ్యాప్తి.. హాస్టల్లో 19 మంది బాలికలకు పాజిటివ్
New Delhi: భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒక హాస్టల్‌లో నివసిస్తున్న 19 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆరోగ్య శాఖ సిబ్బంది హాస్టల్‌లోని విద్యార్థినులకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్ష నిర్వహించారు.
Coronavirus update india: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. ఒక హాస్టల్‌లో నివసిస్తున్న 19 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆరోగ్య శాఖ సిబ్బంది హాస్టల్‌లోని విద్యార్థినులకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్ష నిర్వహించారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కలిగిన బాలికలకు కోవిడ్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇందులో 19 మంది బాలికలకు పాజిటివ్‌గా తేలింది. మరికొంత మందికి సంబంధించి రిపోర్టులు అందాల్సి ఉందని సమాచారం.
ధమ్తరి బాలికల వసతి గృహంలోని విద్యార్థినులు గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విద్యార్థులు చికిత్స కోసం నగ్రి సివిల్ ఆస్పత్రికి చేరుకోగా, చికిత్స సమయంలో కొందరు విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందరినీ సివిల్ ఆస్పత్రికి తీసుకువచ్చి యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. అందులో 19 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది.
కాంటాక్ట్ ట్రేసింగ్ కింద ఆరోగ్య శాఖ సిబ్బంది హాస్టల్ కు చేరుకుని ఇతర విద్యార్థినులను పరీక్షిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనికితోడు పాజిటివ్ గా తేలిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి విడివిడిగా చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ విద్యార్థులందరి పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి..
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాల్లో కరోనా గ్రాఫ్ పెరగడమే కాకుండా, ఇప్పుడు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు కూడా మొదలయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో సోమవారం 3,641 కొత్త కేసులు కనుగొనబడ్డాయి. దీంతో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి చేరింది. ఒక్కరోజే 11 మంది రోగులు కరోనాతో మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 293 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కోవిడ్-19 తో మరణించారు. మహారాష్ట్రలో కూడా 24 గంటల్లో 248 కొత్త కరోనా కేసులు కనుగొనబడ్డాయి. ఒకరు మరణించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో హర్యానాలోని రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు.