న్యూఢిల్లీ: ముంబైలోని పలువురు సినీ నటుల ఇళ్లపై బుధవారం నాడు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ ఇళ్లలో ఐటీ సోదాలు  చేశారు. నిర్మాణ సంస్థ ఫాంటోమ్ ఫిల్మ్స్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఆరోపణలున్నాయి.

ఫాంటోమ్ ఫిల్మ్స్ సంస్థతో సంబంధం ఉన్న డైరెక్టర్లు, నటుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ముంబైకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు అనురాగ్ కశ్యప్, వికాస్ బాహ్ల్, తాప్సీ తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

పన్ను ఎగవేత విషయమై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ముంబైలోని 22 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా అనురాగ్ కశ్యప్, తాప్సీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

అనురాగ్ కశ్యప్, దర్శకుడు విక్రమాదిత్య మోట్వానే, నిర్మాత మధు మంతేనా, యూటీవీ స్పాట్ బాయ్ మాజీ అధిపతి వికాస్ బహల్ ఫాంటమ్ ఫిల్మ్స్ ను స్థాపించారుహసీ తోహ్ ఫేసీ, షాందార్ వంటి చిత్రాలను ఈ ప్రొడక్షన్ హౌైస్ నిర్మించింది. దర్శకుడు వికాస్ బహ్ల్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు తర్వాత 2018లో కంపెనీని మూసివేశారు.ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్ ను ప్రారంభించారు.