Asianet News TeluguAsianet News Telugu

యోగి ఆదిత్యానాథ్ యాడ్‌లో కోల్‌కతా ఫ్లై ఓవర్..! టీఎంసీ నేతల విమర్శలు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయన ప్రచారం చిత్రంలో కనిపిస్తున్న ‘అభివృద్ధి చిహ్నాలు’ ఫ్లై ఓవర్, భవనాలు ప్రత్యర్థి పార్టీ టీఎంసీ పాలనలోని బెంగాల్‌కు చెందినవని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. కొందరు రిపోర్టర్లూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ చిత్రాలను జతచేసి టీఎంసీ నేతలు బీజేపీ పాలనపై విమర్శలు కురిపిస్తున్నారు.

in yogi adityanath ad appears kolkata fly over triggers sharp response from TMC
Author
Kolkata, First Published Sep 12, 2021, 1:51 PM IST

కోల్‌కతా: యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఘనమైన అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ బీజేపీ ప్రభుత్వం ఓ జాతీయ పత్రికకు ఫ్రంట్ పేజ్‌లో ఫుల్ యాడ్ ఇచ్చింది. అందులో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నిలువెత్తు ఫొటో ఉండగా, కింద భవంతులు, ఫ్లై ఓవర్, ఫ్యాక్టరీల చిత్రాలున్నాయి. ఇక్కడే వచ్చింది చిక్కు. ఈ భవనాలు, ఫ్లై ఓవర్‌లు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందినవిగా కనిపిస్తున్నాయి. దీంతో టీఎంసీ నేతలు రంగప్రవేశం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్లతో పోటెత్తారు.

ఓ రిపోర్టర్ చేసిన ట్వీట్‌ను పేర్కొంటూ టీఎంసీ సీనియర్ లీడర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీజేపీపై విమర్శలు కురిపించారు. యోగి హయాంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి అంటే మమతా బెనర్జీ సారథ్యంలో బెంగాల్‌లో జరిగిన అభివృద్ధిని సొంత పనిగా చెప్పుకోవడమేనని ఎద్దేవా చేశారు. బలమైన బీజేపీ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ మోడల్ ఘోరంగా విఫలమైందని, ఈ విషయం ఇలా స్పష్టమైందని ట్వీట్ చేశారు.

 

ముఖ్యమంత్రులను మార్చుకుంటూ ప్రభుత్వాలను కాపాడుతున్న నరేంద్ర మోడీ నిస్సహాయత కనిపిస్తున్నదని, ఇప్పుడు మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన అభివృద్ధిని సొంత అభివృద్ధిగా చెప్పుకోవడానికీ ఉపక్రమించారని టీఎంసీ నేత ముకుల్ రాయ్ ఆరోపించారు.

యోగి ఆదిత్యానాథ్ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నది కోల్‌కతాలోని ‘మా ఫ్లై ఓవర్’ అని, జూమ్ చేసి చూస్తే బెంగాల్‌లోనే కనిపించే యెల్లో అంబాసిడర్ ట్యాక్సీలు ఫ్లై ఓవర్‌పై కనిపిస్తున్నాయని మరో టీఎంసీ నేత సాకేత్ గోఖలే వివరించారు. మరో రెండు భవనాలు అదే ఫ్లై ఓవర్ సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ అని ఇంకో యూజర్ వివరించారు. కాగా, అదే చిత్రంలోని ఫ్యాక్టరీలు, ఇద్దరు కార్మికుల చిత్రం ఓ అమెరికా కంపెనీకి చెందినదని మరో రిపోర్టర్ వివరించారు.

 

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు టీఎంసీకి కలిసొచ్చినట్టయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకమని బీజేపీ భావిస్తున్నది. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios