క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తానంటున్న రైల్వే

రైల్వేశాఖ ఓ వినూత్న పద్ధతికి తెరలేపింది. ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తానంటూ ప్రకటించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్మూలించడానికి రైల్వే రివార్డ్స్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్‌లలో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను రీసైకిల్‌ చేయడానికి ఉపయోగపడితే ప్రయాణికులకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం వడోదర రైల్వే స్టేషన్‌లో బాటిల్‌ క్రషర్లను ఇన్‌స్టాల్‌ చేసింది. ఈ స్కీమ్‌ కింద క్రషింగ్‌ మిషన్‌లో ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే, ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ప్రయాణికుల పేటీఎం అకౌంట్‌లో క్రెడిట్‌ చేయనుంది. 

ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి, బాటిల్‌ను వేసిన తర్వాత ప్రయాణికులు మొబైల్‌ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ అయి ఉన్న పేటీఎం అకౌంట్‌లోకి ఆ డబ్బులు వెళ్తాయి. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దేశీయ రైల్వే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంతో కొంతమేర ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించవచ్చని దేశీయ రైల్వే యోచిస్తోంది. వడోదరతో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి మిషన్లనే ఏర్పరించింది.