Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజలను దారుణంగా మోసం చేసింది.. బండి సంజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిందని, పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ అన్నారు. 

In the name of budget, Congress has badly cheated people : Bandi Sanjay  - bsb
Author
First Published Feb 10, 2024, 2:28 PM IST | Last Updated Feb 10, 2024, 2:29 PM IST

కరీంనగర్ : తెలంగాణలో నేడు ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిమీద బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లకుపైగా అవసరం అని.. కానీ, బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు రూ.53 వేల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

బడ్జెట్ సాక్షిగా..  బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వంచించిందని అన్నారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని.. పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదన్నారు. 

హైదరాబాద్ కేంద్రంగా మూడు జోన్లు, మూసీ ప్రక్షాళన .. రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్‌లో భాగ్యనగరంపై ఫోకస్

ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ కాంగ్రెస్ అని, పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ అని, పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. 

బండి సంజయ్ కు అండగా మోదీ, రాముడు ఉన్నారని చెప్పుకున్నారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ, రాక్షసుల పార్టీ అండగా ఉందని అన్నారు. రామరాజ్యం కోసం తపిస్తున్న మోదీ పాలన కావాలా?... రజాకార్ల రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? అని ప్రశ్నించారు. 

నిరంతరం ప్రజల కోసం పోరాడే బండి సంజయ్ కావాలా?... విహార యాత్రల మాదిరిగా అప్పడప్పుడు వచ్చే నేతలు కావాలా? అన్నారు.  రాముడి వారసుల పార్టీ కావాలా?.... రాక్షస వారసుల పార్టీలు కావాలా?, దేవుడిని నమ్మే బీజేపీ కావాలా? దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా? అంటూ సూటి ప్రశ్నలు సంధించారు. 

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పేదల కోసం యుద్దం చేస్తున్న బండి సంజయ్ ను గెలిపించాలని అన్నారు. నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేసేందుకు అందరం కంకణం కట్టుకుందాం అన్నారు. అందుకే ప్రజా హిత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని చెప్పుకొచ్చారు. నిండు మనసుతో ఆశీర్వదించి ప్రజాహిత యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios