లక్నో: ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. 10 ఏళ్ల తర్వాత ఈ రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది.

టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలు కావడం యూపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానంలో ఆశుతోష్ సిన్హా, టీచర్జ్ ఎమ్మెల్సీ స్థానంలో లాల్ బిహారీ యాదవ్ గెలుచుకొన్నారు.

ఈ స్థానాలకు మంగళవారం నాడు పోలింగ్ జరిగింది. ఈ రెండు స్థానాలతో పాటు మరో 9 స్థానాలకు కూడ ఎన్నికలు జరిగాయి.  ఐదు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆరు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

11 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా రెండు స్థానాల ఫలితాలను శనివారం వరకు రాలేదు. సమాజ్ వాదీ పార్టీ మూడు, ఇద్దరు ఇండిపెండెంట్లు  విజయం సాధించారు.

ఇది పెద్ద విజయమని వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన లాల్ బీహారీ యాదవ్ చెప్పారు.  యూపీ శాసనమండలిలో 100 మంది సభ్యులున్నారు.  శాసనసభ, శాసనమండలి ఉన్న రాష్ట్రాల్లో యూపీ కూడ ఒకటి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో రెండు సభలున్నాయి.