పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన 100 గంటల్లో నే బుద్ధి చెప్పామని భారత ఆర్మీ ప్రకటించింది.  సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఇటీవల సీఆర్పీ జవాన్లు 43 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. కాగా..  16గంటల పాటు ఎన్‌కౌంటర్‌ జరిపి దాడికి సూత్రధారులైన జైషే మహ్మద్‌ కమాండర్లు అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ, కమ్రాన్‌లతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

దీనిపై భారత ఆర్మీలోని చినార్ కార్ప్స్ కమాండర్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్ మీడియాతో మాట్లాడారు.  పుల్వామా దాడి జరిగిన 100 గంటల్లోనూ జైషే మహ్మద్ ని హతమార్చామని చెప్పారు. గతంలో ఇంత పెద్ద కారు బాంబు మనదేశంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. కేవలం పాకిస్థాన్ లాంటి దేశాల్లోనే జరిగేవన్నారు.

కశ్మీర్ లో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు ఎలా సమకూరాయన్నదానిపై సమాచారం తమకు ఉందన్నారు. జైషేని పాక్ ఆర్మీ పెంచి పోషించిందన్నారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి ప్రేరేపితులై తుపాకులు పట్టుకున్న ప్రతి ఒక్కరు లొంగిపోకపోతే మృత్యువు లేదంటే వారిని చంపేస్తామని ధిల్లాన్‌ చెప్పారు.

తల్లిదండ్రులకు తమ కొడుకులను ఆయుధాలు వదిలి లొంగిపొమ్మని చెప్పాలని విన్నవించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై సైన్యం నిర్ణయం స్పష్టంగా ఉందన్నారు. కశ్మీర్‌ లోయలో అక్రమంగా ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో వెళ్లలేరని స్పష్టం చేశారు.