Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కతా : 'చైనీస్ న్యుమోనియా' బారినపడ్డ 10 ఏళ్ల బాలిక .. వైద్యులు ఏమంటున్నారంటే..?

కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో 10 ఏళ్ల బాలికలో 'చైనీస్ న్యుమోనియా' - (మైకోప్లాస్మా న్యుమోనియా ) అనే అరుదైన రకాన్ని కనుగొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోనికి చెందిన శిశువు తేలికపాటి శ్వాసకోశ బాధ, జ్వరం , దగ్గు ఇబ్బందులతో డిసెంబర్ 25న స్థానిక పార్క్ సర్కస్ ఆసుపత్రిలో చేరింది. 

In Kolkata, 10-year-old girl detected with Chinese pneumonia ksp
Author
First Published Jan 3, 2024, 3:19 PM IST

కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో 10 ఏళ్ల బాలికలో 'చైనీస్ న్యుమోనియా' - (మైకోప్లాస్మా న్యుమోనియా ) అనే అరుదైన రకాన్ని కనుగొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోనికి చెందిన చిన్నారిలో తేలికపాటి శ్వాసకోశ బాధ, జ్వరం , దగ్గు ఇబ్బందులతో డిసెంబర్ 25న స్థానిక పార్క్ సర్కస్ ఆసుపత్రిలో చేరింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వైద్యులు మైకోప్లాస్మా న్యుమోనియా ఆమె అనారోగ్యానికి కారణమని గుర్తించారు. ఈ మేరకు జాతీయ వార్తాసంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. 

గతేడాది నవంబర్‌లో మైకోప్లాస్మా న్యుమోనియా వల్ల చైనాలో శ్వాసకోశ వ్యాధి పెద్దఎత్తున వ్యాపించినందున దీనిని 'చైనీస్ న్యుమోనియా' అని వైద్యులు పిలుస్తున్నారు. ఎయిమ్స్-ఢిల్లీలోని వైద్యులు కొన్ని వారాల క్రితం ఏడుగురు రోగులలో, ఎక్కువగా పిల్లలలో ఈ ఇన్ఫెక్షన్‌ను కనుగొన్నారు. అయితే కోల్‌కతా ఆసుపత్రిలో చిన్నారి మాత్రం చికిత్సకు బాగా స్పందిస్తోందని డాక్టర్లు పేర్కొన్నారు. చైనాతో పాటు అమెరికా సహా ఇతర దేశాల్లో శ్వాసకోశ సంక్రమణ పెరుగుదలకు ఈ న్యుమోనియా కారణమవ్వడంతో పాటు కొన్ని మరణాలకు దారితీసింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్న వృద్ధులు కూడా దీని బారినపడుతున్నారు. 

మైకోప్లాస్మా న్యుమోనియా అనేది బ్యాక్టీరియా. ఇది ప్రదానంగా శ్వాసకోశ మార్గంలో ఇబ్బంది కలిగిస్తుంది. గుండె, మూత్రపిండాలు, కళ్లు వంటి ఇతర అవయవాలను కూడా దెబ్బతీస్తూ తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది. ఇందులో ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఇన్ఫెక్షన్ యాంటీ బయాటిక్స్‌కు బాగా స్పందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మందులతో బాలిక బాగా కోలుకుంటోందని, ఆమెకు ఎలాంటి ఇంటెన్సివ్ సపోర్ట్ అవసరం లేదని ఐసీహెచ్ కోల్‌కతాలోని పీడియాట్రిక్ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ జైదేబ్ రే చెప్పారు. 

మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ మిహిర్ సర్కార్ ప్రకారం.. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలలో విస్తరిస్తున్న న్యుమోనియాలో 5 నుంచి 10 శాతానికి కారణం ఈ మైకోప్లాస్మా న్యుమోనియానే. ఇది ఎక్కువగా ఐదేళ్ల పైన వయసున్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పరిమిత వనరుల కారణంగా తాము తరచుగా ఈ బ్యాక్టీరియాను ఎదుర్కొంటున్నట్లు సర్కార్ తెలిపారు. ఇతర శ్వాసకోశ వ్యాధికారకాల మాదిరిగానే తుంపర్ల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన వెల్లడించారు. మాస్క్, చేతులను శుభ్రంగా వుంచుకోవడం వంటి చర్యలతో వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని సర్కార్ వెల్లడించారు. 

తాజాగా కోల్‌కతా బాలిక విషయంలో వైద్యులు ఛాతీ ఎక్స్‌ రేలో , కళ్లు, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా సంకేతాలను గుర్తించారు. తదుపరి పరీక్షలు మైకోప్లాస్మా న్యుమోనియాను నిర్ధారించాయి. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలే వున్నప్పటికీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు  సూచిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios