ఓ మహిళ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. కాగా... అందులో టీచర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు వివాహం అయ్యింది. పెళ్లి జరిగిన  నాలుగు నెలలకే ఆమెకు డెలవరీ అయ్యింది. దీంతో... ఆమె మరో మూడు నెలలపాటు మెటర్నరీ లీవ్ కోసం అప్లై చేసింది. ఆ లీవ్ ముగిసిన తర్వాత స్కూల్ కి వచ్చిన ఆ టీచర్ ని అనుమతించకపోవడం గమనార్హం. 

పెళ్లి జరిగిన కేవలం నాలుగు నెలలకే మెటర్నటీ లీవ్ ఎలా పెడతారు.. అంటూ.. ఆ టీచర్ స్కూల్ నుంచి బహిష్కరించారు.  దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొట్టక్కల్ ప్రీ ప్రైమరీ స్కూల్. అక్కడో టీచర్‌ మొదటి భర్తతో విడిపోయారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల ప్రక్రియ నడుస్తుండగానే .. రెండో పెళ్లికి రెడీ అయ్యారు. అధికారికంగా విడాకులు మంజూరు కాకపోవడంతో.. రెండో వ్యక్తితో సహజీవనం చేశారు. చివరికి 2018 జూన్‌లో అధికారికంగా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అప్పటికే గర్భవతి కావడంతో .. మెటర్నిటీ లీవ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చారు.
 
ప్రసూతి సెలవులు ముగియడంతో ఈ ఏడాది జనవరిలో స్కూల్‌కు వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. పెళ్లైన నాలుగు నెలలకే మెటర్నిటీ లీవ్స్‌కు దరఖాస్తు చేయడాన్ని కారణంగా చూపుతూ ఆమె స్కూల్‌కి రావడాన్ని నిరాకరించారు. చివరికి ఆమె బాలల హక్కుల కమిషన్‌ను సంప్రదించి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసింది. విచారణ జరపాల్సిందిగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(డీడీఈ) అధికారులను ఆదేశించింది. 

ఆమెను స్కూల్‌లోకి అనుమతించాల్సిందిగా డీడీఈ తేల్చి చెప్పింది. అయితే స్కూల్ హెడ్మాస్టర్, పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు. దీంతో ఆమె ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూల్ అధికారులకు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. తన వైవాహిక జీవితం, ప్రసూతి కాలం గురించి వాళ్లకెందుకంత బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కంప్లైంట్ స్వీకరించిన కొట్టక్కల్ ఎస్ఐ సంధ్యా దేవి.. కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.