కేరళను బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ఒక కుదుపుకుదుపుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్‌ను తొలగించారు.

ఇటీవల యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన కన్‌సైన్‌మెంట్ దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఇంత మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. విదేశాంగ శాఖ నుంచి అనుమతి పొంది తనిఖీలు నిర్వహించారు.

కన్‌సైన్‌మెంట్ ఓ ఛార్టెర్డ్ విమానం ద్వారా తిరువనంతపురానికి చేరుకుంది. మామూలుగా అయితే కన్‌సైన్‌మెంట్లకు ఎలాంటి తనిఖీలు నిర్వహించరు. దీనిని అదునుగా భావించిన స్మగ్లింగ్ సిండికేట్ కొంతమంది దిగువ స్థాయి ఉద్యోగులను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటోందని కస్టమ్స్ అనుమానం వ్యక్తం చేశారు.

ఎవరికీ అనుమానం రాకుండా గృహోపకరణాల మధ్య బంగారాన్ని దాచి తరలిస్తున్నారని కస్టమ్స్ దర్యాప్తులో తేలింది. దేశీయంగా పసిడి ధరలు చుక్కలు చూస్తున్న తరుణంలో స్మగ్లింగ్ సిండికేట్‌లు రెచ్చిపోతున్నాయి.

ఇక ఈ కేసుకు సంబంధించి యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్న సరిత్ కుమార్, స్వప్నా సురేశ్‌లను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

సీఎంవో నుంచి నేరుగా ఫోన్లు వెళ్లడం వల్లే.. బంగారం స్మగ్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కస్టమ్స్ నిర్థారణకు వచ్చింది. మరోవైపు ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం... రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది.

గోల్డ్ స్మగ్లింగ్‌లో సీఎంవో పాత్ర ఉన్నట్లు కేరళ విపక్ష నేత రమేశ్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ప్రధాని మోడీకి లేఖ రాశారు. యూఏఈ కాన్సులేట్ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు.

కేరళ ప్రభుత్వంలో పనిచేస్తున్న వారు.. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లర్లతో కలిసి దందా సాగిస్తున్నట్లు రమేశ్ ఆరోపించారు. ఇకపోతే సీఎం విజయన్ వద్ద సెక్రటరీగా వున్న శివశంకర్‌ను తప్పించడంతో ఆయన స్థానంలో కన్నూరు మాజీ కలెక్టర్ మీర్ మొహమ్మద్‌ను నియమించినట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రతిపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కొంతమంది ముఖ్యమంత్రిని, సీఎం కార్యాలయాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉన్నాయని అన్నారు. ఈ కేసును కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని విజయన్ సూచించారు.