Chaddi war: కర్ణాటకలో కాంగ్రెస్‌, అధికార బీజేపీ మధ్య మ‌రో వివాదం చెలారేగింది. ఇరువ‌ర్గాల మ‌ధ్య తాజాగా చెడ్డీ వార్‌ నడుస్తున్నది. పాఠ్య‌ పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు చేసిన నిర‌స‌న‌లకు, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన‌కు వ్య‌తిరేకంగా... బీజేపీ కార్యకర్తలు విచిత్రమైన క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి చ‌డ్డీలను(లోదుస్తులు) సేకరిస్తున్నారు. వాటిని డబ్బాల్లో కాంగ్రెస్‌ నేతలకు పంపిస్తున్నారు. 

Chaddi war: క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో మరో వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో రైట్ వింగ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. నిర‌స‌న‌గా రైట్‌వింగ్ కార్యకర్తలు చ‌డ్డీలను(లోదుస్తులు) సేకరించి కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై సిద్ధరామయ్య చేసిన ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని బిజెపి ప్రధాన కార్యదర్శి సిటి రవి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

అసలు వివాదం ఏంటి?

ఇటీవల కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు .. పాఠ‌శాల‌ పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్‌ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖాకీ నిక్కర్‌కు నిప్పు పెట్టారు. ఈ నిర‌స‌న‌ను అడ్డుకునేందుకు NSUI కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

మ‌రోవైపు ..ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు మంత్రి ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందనగా కాంగ్రెస్ నిరసనలను ఉద్ధృతం చేయాలని, కూడళ్లలో ఖాకీ నిక్కర్లను కాల్చివేయాలని పిలుపు నిచ్చింది. దీంతో సోమవారం కాంగ్రెస్‌ కార్యకర్తలు పలు చోట్ల నిక్కర్లను కాల్చి నిరసనలు తెలిపారు. 

కాంగ్రెస్ కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నిరసన సమయంలో.. మేము లాంఛనప్రాయంగా ఒక చ‌డ్డీని తగలబెట్టాము. కానీ పోలీసులు, ఆర్ ఎస్ ఎస్, ప్రభుత్వం దానిని పెద్ద సమస్యగా మార్చాయి. మేము ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్నామని సిద్ధరామయ్య అన్నారు. కాబట్టి చడ్డీల‌ దహనం ప్రచారాన్ని ప్రారంభించామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలో చిత్రదుర్గ, చిక్‌మంగళూరులో పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు లోదుస్తులను దహనం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి సంఘ వ్యతిరేక పని చేయలేదని, ఇది చట్ట విరుద్ధ చర్య ఎలా అవుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం చట్ట ఉల్లంఘన కాదని అన్నారు. న్యాయం కోసం పోరాడే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చిందనీ, రాష్ట్ర ప్రభుత్వం మా కార్యకర్తలను విడుదల చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా 'చడ్డీ జలావో' ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

దీనికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు విచిత్రమైన క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి చ‌డ్డీలను(లోదుస్తులు) సేకరిస్తున్నారు. వాటిని డబ్బాల్లో కాంగ్రెస్‌ నేతలకు పంపిస్తున్నారు. మాండ్యాలో కార్మికులు అట్టపెట్టె నిండా చ‌డ్డీలను(లోదుస్తులు) సేకరించి కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయానికి పార్శిల్ చేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ప్యాకేజీ అందలేదన్నారు.