పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఆనందం కొద్ది సేపు కూడా నిలవలేదు. దాడులు చేసిన 24గంటల్లోనే వైమానికదళ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ చెరలో చిక్కుకుున్నారు. కాగా.. అతనిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

కాగా.. అభినందన్. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు. చెన్నైకి చెందిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను పాకిస్తాన్‌ సైన్యం బంధించిందని తెలిసి అక్కడికి పెద్ద సంఖ్యలో బంధువులు, ప్రజలు తరలి రావడంతో పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాటుచేసింది. 

నివాసంలోకి సాధారణ వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. చెన్నై పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించి.. అభినందన్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

అలాగే అన్నాడీఎంకే శ్రీపెరంబదూరు ఎంపీ కేఎన్‌రామచంద్రన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ తదితరులు స్వయంగా వర్ధమాన్‌ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అభినందన్‌ను వీలైనంత త్వరగా విడిపించాలని వారు భారత ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా ట్విట్టర్‌లో ఒక సందేశం విడుదల చేస్తూ... పాకిస్తాన్‌లో చిక్కుకున్న వైమానిక దళం పైలట్‌ అభినందన్‌ ను క్షేమంగా స్వదేశానికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.