విమానంలో గాలి ఆడక.. ఉక్కగా ఉందని చెప్పి.. ఓ ప్రయాణికుడు చేసిన పనికి అందరూ కంగుతిన్నారు. ఉక్కగా ఉందని చెప్పి.. విమానం అత్యవసర డోర్ ఓపెన్ చేశాడు. అయితే.. దీనిని వెంటనే గమనించిన సిబ్బంది.. విమానం టేకాఫ్ కి ముందే ఆ డోర్ ని మూసేశారు. దీంతో.. పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం జరిగింది. లక్నోకు వెళ్లేందుకు గాను సునీల్‌కుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 8 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చాడు. గోఎయిర్‌ విమానంలో ఎక్కి..తనకు కేటాయించిన విండో పక్కన సీటులో కూర్చున్నాడు. 

ఉక్కపోతగా ఉండటంతో అత్యవసర కిటికీ ద్వారానికి ఏర్పాటు చేసిన గ్లాస్‌ డోర్‌ను పక్కకు జరిపాడు. దీన్ని విమాన సిబ్బంది గుర్తించి అతడిని హెచ్చరించి వెంటనే డోర్‌ మూసి వేయించారు. సునీల్‌ను విమానంలో నుంచి కిందికి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ..తాను మొదటిసారిగా విమానం ఎక్కానని, గాలి తగలకపోవడంతోనే విండో డోర్‌ తెరిచానని..ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విమానాశ్రయ అధికారులకు చెప్పాడు. 

అనంతరం అతడిని మరో విమానంలో లక్నోకు పంపించారు. ఈ ఘటనపై గో ఎయిర్‌ సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చెయ్యలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు.