Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రికే కొరడా దెబ్బలు.. వీడియో ఇదే.. ఎందుకో తెలుసా?

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ, ఓ నడి వయస్కుడి చేతిలో కొరడా దెబ్బలు తిన్నాడు. ఎనిమిది సార్లు కొరడా ఝుళిపించినా స్థిరంగా నిటారుగా నిలబడి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినది. గోవర్దన్ పూజ క్రతువులో భాగంగా ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
 

in a viral video chhattisgarh cm bhupesh baghel gets whipped
Author
Raipur, First Published Nov 5, 2021, 2:36 PM IST

రాయ్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రే అధినేత. విధానపరమైన నిర్ణయాలన్నీ ఆయన చేతుల మీదుగానే రూపు పోసుకుంటాయి. రాష్ట్ర ప్రజలందరినీ పాలించే ఆ ముఖ్యమంత్రి స్వయంగా కొరడా దెబ్బలు తింటే..! ఊహించడానికి నమ్మశక్యంగా  లేదు కదూ. కానీ, ఛత్తీస్‌గడ్ Chief Minister Bhupesh Baghel అందరి ముందు కొరడా దెబ్బలు తిన్నాడు. అంతేకాదు, ఆయన దెబ్బలు తింటుంటే వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంతకీ Chattisgarh ముఖ్యమంత్రే కొరడా దెబ్బలు(Whips) తినాల్సిన అగత్యం ఏం వచ్చిందనేది సాధారణంగా అందరికీ కలిగే సందేహమే. సీఎం భుపేశ్ భగేల్ గోవర్ధన పూజ క్రతువులో భాగంగా కొరడా దెబ్బలు తిన్నారు.

ఓ నడి వయస్కుడు తన శక్తి మొత్తం కూడగట్టుకుని కొరడాతో సీఎం భుపేశ్ భగేల్‌ను కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నది. సాంప్రదాయ దుస్తులతో నిలుచున్న సీఎం భుపేశ్ భగేల్ తన చేతిని శపథం చేస్తున్నట్టుగా పిడికిలి బిగించి ఉంచాడు. ఆ చేతిపై కొరడా దెబ్బలు కొట్టారు. ఈ తంతు జరుగుతుండగా డప్పులు, ఇతర చప్పుళ్లు వినిపించాయి.

ఆ నడి వయస్కుడు సీఎం భుపేశ్  భగేల్‌ను ఎనిమిది సార్లు కొరడాతో తీవ్రంగా కొట్టారు. చేతిపై ఎనిమిది సార్లు కొట్టిన తర్వాత కొరడాను ఆపాడు. వెంటనే సీఎం భుపేశ్ భగేల్‌ను వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు.

Also Read: సంఘ్‌‌ను నక్సల్స్‌తో పోల్చిన సీఎం.. ‘వీరి నేతలు నాగ్‌పూర్‌లో వారి నేతలు తెలంగాణ, ఆంధ్రలో.. ’

ఛత్తీస్‌గడ్‌లో గోవర్దన్ పూజ ప్రతియేటా నిర్వహిస్తారు. సరిగ్గా దీపావళి తర్వాతి రోజే ఈ పూజ చేస్తారు. ఈ ఏడాది శుక్రవారం జరిపారు. ఈ పూజ గురించి పెద్దలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. భగవన్ శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్దన గుట్టను ఎత్తి గోకులంలోని ప్రజలను కాపాడారని, తద్వారా ఇంద్రదేవుడి గర్వాన్ని భంగపరిచారని చెబుతారు. అప్పటి నుంచి ఈ గోవర్దన్ పూజ నిర్వహిస్తున్నట్టు వివరిస్తున్నారు.

ఈ పండుగ సంప్రదాయం ప్రకారం, గోవర్దన పూజలో ఒక వ్యక్తిని కొరడాతో పూర్తి శక్తితో కొడతారు. ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, భవిష్యత్ కలిసి వస్తుందనీ విశ్వసిస్తారు. తాజాగా, ఈ క్రతువులో సీఎం భుపేశ్ భగేల్ పాల్గొన్నారు. అంతేకాదు, ఆయనే కొరడా దెబ్బలు తిన్నారు.

Also Read: ముఖ్యమంత్రి తండ్రిపై ఎఫ్ఐఆర్.. చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం వ్యాఖ్య

ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ తండ్రి ఇటీవలే వార్తలో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడి ఆయన మరో వర్గ ఆగ్రహానికి గురయ్యారు. బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదుతో ఛత్తీస్‌గడ్ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత ఆయనను అరెస్టూ చేశారు. దీనిపై సీఎం భుపేశ్ భగేల్ స్పందించారు. న్యాయం ముందు అందరూ సమానులేనంటూ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios