కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం... చాలా మందికి వేలల్లో జరిమానాలు పడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాట ట్రాఫిక్ పోలీసులు తీస్తున్నారు. కాగా... తాజాగా ఓ వ్యక్తికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించారు. అయితే...స్కూటర్ ని షోరూం నుంచి తీసుకువచ్చిన కొన్ని గంటల్లోనే అతనికి లక్ష జరిమానా పడటం గమనార్హం. ఈ సంఘటన భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఇంతేకాకుండా భువనేశ్వర్ ఆర్టీవో అధికారులు ఆ డీలర్‌షిప్ నకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామన్నారు. 

అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేశారని డీలర్‌ను ప్రశ్నించారు. కాగా కొత్త మోటారు వాహన చట్టం కింద వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబరు, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటిని వాహనాన్ని అప్పగించే ముందు కొనుగోలుదారునికి డీలర్ అందజేయాల్సివుంటుంది. అతను స్కూటర్ ని రూ.65వేలకు కొనుగోలు చేయగా....  జరిమానా రూ.లక్ష పడటం గమనార్హం.