జైల్లో ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏటీఏం ఏర్పాటు  చేయడం ఎప్పుడైనా విన్నారా..? తొలిసారిగా ఈ సదుపాయం బిహార్ లోని పుర్నియా సెంట్రల్  జైలులో కల్పించారు.  ఖైదీల రోజువారీ అవసరాల కోసం డబ్బును డ్రా చేసుకోవడానికి వీలుగా జైలు ప్రాంగణంలో ఏటీఏం ఏర్పాటు చేశారు.

జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలులోపల ఏటీఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్ జితేంద్రకుమార్ చెప్పారు. పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400మందికి ఏటీఎం కార్డులను జారీ చేశామని, మిగిలిన వారికి కూడా ఏటీఎంకార్డులు త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

 జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల దాకా వేతనం చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖైదీలు జైలులో ఫేస్ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్ ప్రకారం ఒక్కో ఖైదీ 500రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్ ఆయిల్, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు చెప్పారు.