తమిళనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ: చెన్నైలో సబ్‌వేల మూసివేత
తమిళనాడులో గురువారం నాడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇవాళ చెన్నైలోని సబ్‌వే లను మూసివేశారు. మూడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడడం లేదు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని కడలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, రాణిపేట్, వెల్లూరు, తిరువణ్ణామలై, కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 12 మంది మరణించారని రాష్ట్ర మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ప్రకటించారు.
ఇవాళ Heavy rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో Chennaiలోని సబ్ వేల ను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుండి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
also read:తమిళనాడులో రెండు రోజులు రెడ్ అలర్ట్.. వర్షం కొంత తెరిపి ఇచ్చినా.. మళ్లీ కుండపోత?
చెన్నై సెంట్రల్-తిరువళ్లూరు మార్గంతో పాటు అంబత్తూరు, అవడిలో వరదల కారణంగా సబర్బన్ Trains నిలిచిపోయాయి. గుమిడిపూడి మార్గంలో సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.చెన్నైలోని పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. టీ నగర్ వంటి ప్రాంతాల్లోని వీధులన్నీ నీటిలోనే ఉన్నాయి. మడిపాక్కం, తొరైపాక్కం, అంబత్తూరు, కొలత్తూరు, ఎన్నూర్, ముడిచూరులలో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం, సాలిగ్రామం, కెకెనగర్ తో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలున్నాయి.
Tamil Nadu రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 75 వేల పోలీసులు వరద సహాయక చర్యల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 52 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. 90 కీలక రిజర్వాయర్లలో 53 నుండి 76 శాతానికి నీటి నిల్వలు చేరుకొన్నాయని నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. 14,138 సరస్సుల్లో 9,153 వాటర్ బాడీలలో 50 శాతానికి పైగా నీరు చేరుకొందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకొన్నామని చెన్నై కార్పోరేషన్ కమిషనర్ గగన్ దీప్ ఎస్ బేడీ తెలిపారు. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో 250 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.గత 24 గంటల్లో చెన్నైలోని నుంగంబాక్కంలో 114.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. మీనంబాక్కంలో 32 మి.మీ. వర్షపాతం రికార్డైంది.