నెల రోజుల క్రితం భారీ వరదలతో చివురుటాకులా వణికిన కేరళ.. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అరేబియా సముద్రం, శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు..

ఆదివారం భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని... ఎన్‌డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు 5వ తేదీ నాటికి తీరానికి తిరిగి వచ్చేయాల్సిందిగా సూచించారు..

ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సీఎం వెల్లడవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు పర్యాటకులు రాకపోవడమే మంచిదని సీఎం విజ్ఞప్తి చేశారు.