ప్రజలకు భారీ వడ్డీలు ఇస్తానని ఆశ చూపి రూ. 5 వేల కోట్ల మోసానికి పాల్పడిన ఐఎంఏ జ్యూవెల్స్ యజమాని మన్సూర్ అహ్మద్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు దుబాయ్‌లో మన్సూర్‌ను అరెస్ట్ చేశారు.

అనంతరం శుక్రవారం దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.  బెంగళూరు కేంద్రంగా ‘ఐఎంఏ జ్యువెల్స్‌ పేరిట కార్యకలాపాలు సాగించిన మన్సూర్..  లిమిటెడ్ లయబుల్ పార్ట్‌నర్ అనే మోసానికి పాల్పడ్డాడు.

దీని ప్రకారం ఐఎంఏలో ఎవరైనా పెట్టుబడి పెట్టి.. సంస్థలో భాగస్వామి కావొచ్చు.. అక్కడితో ఆగకుండా ఆ పెట్టుబడిపై నెలసరి వడ్డీ చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో జనం ఎగబడ్డారు. దాదాపు పదేళ్ల పాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా మన్సూర్ వ్యవహారాన్ని నడిపాడు.  

ఆ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారికి వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే కొద్దిరోజుల తర్వాత వడ్డీలు అందకపోవడం.. మన్సూర్ పత్తా లేకుండా పోవడంతో జనానికి విషయం అర్థమైంది.

సుమారు 50 వేలమంది డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలన సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మన్సూర్ అహ్మద్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.