వివాహేతర సంబంధం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధాన్ని కలిగివున్న మహిళతో పాటు అభం శుభం తెలియని ఆమె ఇద్దరు కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మొండెం, తల వేరు చేసి వేరు వేరు ప్రాంతాల్లో పడేసి నిందితుడు రాక్షసానందం పొందాడు. 

ఈ దుర్ఘటన హర్యానా రాజధాని చండీఘడ్ సమీపంలో చోటుచేసుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత విభేదాల కారణంగా  భర్తతో విడిపోయింది. దీంతో తన  కూతురితో(12) కలిసి ఉపాధి నిమిత్తం హర్యానాలోని భివానీ జిల్లాకు చేరుకుంది. 

ఈ క్రమంలో ఆమెకు స్క్రాప్ వ్యాపారం చేసే రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ బంధం కారణంగా సదరు మహిళ మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వీరి అక్రమ బంధం గురించి రాజేష్ కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు గట్టిగా బెదిరించడంతో గత కొంత కాలంగా  దూరంగా వుంటున్నారు. 

అయితే  కొద్దిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ రాజేష్ ను ఆమె డిమాండ్ చేయడం ప్రారంభించింది. అందుకు నిరాకరించిన అతడిపై పోలీస్ కేసు కూడా పెట్టింది. దీంతో  ఆగ్రహంతో రగిలిపోయిన అతడు ఆమె అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. 

ఇద్దరు స్నేహితులతో కలిసి సదరు మహిళతో పాటు ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాల మొండెం, తలలను వేరుచేశారు. మొండేలను ఓ డ్రమ్ములో కుక్కి ఇంట్లోనే వుంచి తలలను సమీప అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.

 కొద్ది రోజులుగా మహిళ ఇంట్లొ ఎవరూ కనిపించకపోవడం...ఇంట్లోంచి దుర్వాసన వస్తండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా తలలు లేని మూడు మొండేలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నారు.