కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని దారుణం చోటుచేసుకుంది. వివాహేతన సబంధంతో ఒక్కటైన ఓ జంట విడిపోయి ఉండలేక...సమాజాన్ని ఎదిరించి కలిసి బ్రతకలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హోసురు పట్టణానికి సమీపంలోని ప్రేమ అనే వివాహితకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ బాధ్యత ఆమెపై పడింది. దీంతో హోసూరులో కూరగాయలు విక్రయిస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. 

ఈ క్రమంలో ప్రేమకు నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా కేవలం శారీరక సంబంధమే కాకుండా ఇద్దరి హృదయాలు కూడా ఒక్కటై ఒకరిని విడిచి ఒకరు వుండలేని స్థాయికి చేరుకున్నారు. దీంతో నాగరాజు తన భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ ప్రేమ వద్దే వుండటం ప్రారంభించాడు. 

దీంతో నాగరాజ్ భార్య మాదేవమ్మ పుట్టింటి, అత్తింటి వారి ముందే భర్తను అక్రమసంబంధం గురించి నిలదీసింది. కుటుంబ సభ్యులు కూడా అతన్ని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఇకనుంచి కలిసివుండటం కుదరదని భావించిన ప్రేమ, నాగరాజులు దారుణానికి పాల్పడ్డారు.

ప్రేమ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గుర్తించిన స్థానికులు కొనఊపిరితో వున్న వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే  మృతి చెందారు. ఈ ఆత్మహత్యలపై హొసూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.