బీహెచ్‌యూలో ఇఫ్తార్ విందు చిచ్చురేపింది. వైస్ ఛాన్సలర్ ఇఫ్తార్ విందుకు హాజరుకావడం పట్ల స్టూడెంట్లు నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం ఈ నిరసన తారా స్థాయికి చేరుకుంది. ఏకంగా వైస్ ఛాన్సలర్ నివాసం ఎదుట స్టూడెంట్లు గుండు కొట్టించుకున్నారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇఫ్తార్ విందు, వివాదాస్పద నినాదాల వివాదం ఆగేలా కనిపించడం లేదు. దీనిపై వరుసగా మూడు రోజులుగా వివిధ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఇఫ్తార్ విందులో వైస్‌ఛాన్సలర్ బుధవారం పాల్గొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ మరుసటి రోజు (గురువారం) కులం, కశ్మీర్ అంటూ గోడపై రాసి ఉన్న నినాదాలు ఈ వాతావరణాన్ని వేడెక్కించాయి.
మహిళా కళాశాలలో జరిగిన ఇఫ్తార్ విందుకు వీసీ హాజరైన తర్వాత నిరసనలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం పదుల సంఖ్యలో విద్యార్థులు గంగాజల్‌ను కాడలో పెట్టుకుని వైస్ ఛాన్సలర్ నివాసానికి చేరుకున్నారు. గేటు వద్ద చిందులు వేయడం ప్రారంభించారు. ఇఫ్తార్ విందుకు కౌంటర్‌గా యూనివర్శిటీ ముందు విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో పాటు అక్కడే నిలబడిన ప్రొక్టోరియల్ బోర్డు సభ్యులపై కూడా విద్యార్థులు గంగాజలం చల్లారు. అదే సమయంలో వైస్ ఛాన్సలర్ నివాసం ఎదుట కొందరు విద్యార్థులు గుండు కొట్టించుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు బీహెచ్‌యూ వీసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నినాదం రాసిన వ్యక్తిని అరెస్టు చేయడంతో ఇఫ్తార్‌కు హాజరైన వైస్‌ఛాన్సలర్ క్షమాపణలు చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీహెచ్‌యూ విద్యార్థి శుభమ్ తివారీ మాట్లాడుతూ.. ఇఫ్తార్‌ను అధికారికంగా నిర్వహించిన విధానం, ఈ కొత్త సంప్రదాయానికి పునాది వేస్తోందన్నారు. క్యాంపస్‌లో కులం, కాశ్మీర్‌కు సంబంధించి చాలా అభ్యంతరకరమైన నినాదాలు రాశారని శిరోముండనం చేయించుకున్న విద్యార్థి ఆశీర్వాద్ దూబే అన్నారు. గోడలపై నినాదాలు రాసిన వారినెవరినీ ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదని మరో స్టూడెంట్ తెలిపారు. అలా జరగకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా ఈ వైస్ ఛాన్సల్ ఇఫ్తార్ విందుకు హాజరుకావడం పట్ల అడ్మినిస్ట్రేటివ్ గతంలోనే వివరణ ఇచ్చింది. ఇఫ్తార్ అనేది మహిళా కాలేజీ సంప్రదాయం అని తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దీనిని నిలిపివేశారు. ‘‘ఇఫ్తార్ విందులు గతంలో వివిధ సందర్భాలలో నిర్వహించారు. మునుపటి వైస్-ఛాన్సలర్లు కూడా పాల్గొన్నారు. దీనిని మహమ్మారి కాలంలో మాత్రమే నిర్వహించలేదు’’ అని పేర్కొంది.
గోడలపై రాసిన అభ్యంతరకర నినాదాల విషయంలో లంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇఫ్తార్‌కు సంబంధించి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది. వైస్ ఛాన్సలర్ హాజరైన ఇఫ్తార్ దశాబ్దాల నాటి సంప్రదాయమని శుక్రవారం కూడా BHU APRO చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని చెప్పారు.
