కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లు వేస్తున్నారని, వారు సంపాదించుకుంటుంటే.. వీరు పోస్టర్లు వేయడానికి సరిపోతున్నారని ఆరోపించారు. చాలా బీజేపీ రాష్ట్రాలు ఈ సినిమాపై ట్యాక్స్ ఎత్తేశాయని, ఇక్కడ కూడా ఎత్తేయాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఒక వేళ బీజేపీ నేతలకు నిజంగా అంత ఆసక్తి ఉంటే.. సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని వివేక్ అగ్నిహోత్రిని అడిగితే సరిపోతుందని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ నేతలు అందరూ ఈ సినిమా పోస్టర్లు వేయడంలో బిజీ అయ్యారని ఆరోపించారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఈ సినిమాపై ట్యాక్స్ ఎత్తేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు. ‘అసలు వీళ్లు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రజల సంక్షేమం కోసం, వారికి సేవలు అందించడానికి వచ్చారా? లేక సినిమా పోస్టర్లు వేయడానికి వచ్చారా?’ అని ప్రశ్నించారు.

ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ.. కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నీడలోకి వెళ్లాల్సిన గతి పట్టిందని ఆరోపించారు. అంటే.. ప్రధానిగా నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు. ‘అందరు.. బీజేపీ నేతలందరూ కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లు వేస్తున్నారు. ఇది చూస్తే.. వాళ్ల ఇంటిలో పిల్లలు నాన్న మీరేం చేస్తున్నారని అడిగితే.. కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లు వేస్తుంటాం చిన్నా అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు’ అని విమర్శించారు. 

ఇక్కడ కూడా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని డిమాండ్లు చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒక వేళ నిజంగా బీజేపీ నేతలకు అంత ఆసక్తి ఉంటే.. ట్యాక్స్ ఫ్రీ ప్రకటించడం ఎందుకు ఏకంగా సినిమాను యూట్యూబ్‌లో వేయమనండి.. అందరూ ఉచితంగా చూడొచ్చు అంటూ పేర్కొన్నారు.

Scroll to load tweet…

హర్యానాకు చెందిన ఓ బీజేపీ నేత కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓ పార్క్‌లో ఉచితంగా ప్రదర్శిస్తానని ప్రకటించారని ఓ చోట చదివారని కేజ్రీవాల్ అన్నారు. వెంటనే సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అయ్యారని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, టికెట్ తీసుకునే సినిమా ప్రదర్శించాలని షరతు పెట్టారని తెలిపారు. మీకు అర్థం అవుతున్నదా? వాళ్లు కోట్ల సంపాదిస్తూ మిమ్మల్ని పోస్టర్లు వేయడానికి పురమాయించారని ఆరోపణలు చేశారు.

అదే సందర్భంలో బీజేపీ వర్కర్లను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘గొర్రెల్లా నడుచుకోవడం మానుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి. మీకు గౌరవం, మర్యాద దక్కుతాయి. మిమ్మల్ని తప్పుడు నినాదాలు ఇవ్వమని ఆదేశించాం. దేశ నిర్మాణానికి మిమ్మల్ని భాగస్వాములను చేస్తాం. అంతేకానీ, ఒక ఫేక్ ఫిలిమ్‌ పోస్టర్లు అంటించమని అడగం’ అని చెప్పారు.

Scroll to load tweet…

YouTube video player

అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లడయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ కశ్మీరీ పండిట్‌లను ద్వేషిస్తున్నాడని, ఆయన కశ్మీర్ పండిట్‌లను వ్యతిరేకిస్తున్నాడని, అరవింద్ కేజ్రీవాల్ నిజ స్వరూపం బయటపడిందని ట్వీట్లు చేశారు. శుక్రవారం కొన్ని గంటల పాటు ఇలాంటి హ్యాష్‌ట్యాగ్‌లో ట్రెండ్ అయ్యాయి.