ప్రతీ రోజూ చేపలు తినాలని, అలా చేస్తే ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన కళ్లు వస్తాయని మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయకుమార్ గవిత్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయనపై పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
రోజూ చేపలు తింటే నటి ఐశ్వర్యరాయ్ లాగా అందమైన కళ్లు వస్తాయని మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు చేశాయి. అవి ఇప్పుడు వివాదాస్పదంగా మారి దుమారాన్ని రేపుతున్నాయి. ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి విజయకుమార్ గవిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
చేపల్లో సున్నితమైన చర్మానికి దోహదపడే కొన్ని నూనెలు ఉన్నాయని ఆ మంత్రి చెప్పారు. ‘‘రోజూ చేపలు తినేవారిలో మృదువైన చర్మం వస్తుంది. కళ్లు మెరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే, ఆ వ్యక్తి (మీ వైపు) ఆకర్షితులవుతారు. ఐశ్వర్యరాయ్ కళ్లను మీరు చూసి ఉంటారు. అవి ఎంత అందంగా ఉంటాయో. ఆమె కర్ణాటకలోని మంగళూరు తీర ప్రాంతంలో పెరిగారు. ఆమె క్రమం తప్పకుండా చేపలు తినేది, అందుకే ఆమెకు చాలా అందమైన కళ్ళు ఉన్నాయి’’ అని విజయ కుమార్ గవిత్ చెప్పారు.
యువత చేపలు తినడం మొదలుపెడితే అవి కూడా అందంగా కనిపిస్తాయని, అమ్మాయిల హృదయాలను సులభంగా గెలుచుకోవచ్చని మంత్రి సూచించారు. చేపల్లో కొన్ని నూనెలు ఉంటాయని, ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయని తెలిపారు.
కాగా.. గవిట్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. మంత్రి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్సీపీ శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ అన్నారు. అలాగే బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే మాట్లాడుతూ.. ‘‘ నేను రోజూ చేపలు తింటాను. నా కళ్లు అలా (ఐశ్వర్యరాయ్ లాగా) అయి ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధనలు జరిగితే గవిత్ సాహెబ్ ను అడుగుతాను.’’ అని ఎద్దేవా చేశారు.
