ఢిల్లీ అల్లర్ల సమయంలో బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు ఇచ్చారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీపీఎం నేత బృందా కరత్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను దిగువ న్యాయస్థానం తోసిపుచ్చడంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ పిటిషన్ విచారిస్తూ నవ్వుతూ చెబితే నేరమేమీ ఉండదని, వారు చేసిన వ్యాఖ్యల్లో నేరగుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలు పార్టీల నేతలు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ అల్లర్లకు ముందు బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టారని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునేలా ఉసిగొల్పారని సీపీఐం నేత బృందా కరత్ ఓ పిటిషన్ వేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో నేత పర్వేష్ వర్మలు విద్వేష ప్రసంగాలు ఇచ్చినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన ఆ పిటిషన్‌ను దిగువ న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా, ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బృందా కరత్ పిటిషన్‌ను విచారిస్తున్న సింగిల్ జడ్జీ బెంచ్ జస్టిస్ చంద్ర ధారి సింగ్ వ్యాఖ్యానిస్తూ.. ‘ఒక వేళ నవ్వుకుంటూ మాట్లాడితే అందులో నేరాన్ని చూడలేం. కానీ, నేరపూరితంగానే మాట్లాడితే.. దాన్ని నేరంగా పరిణగించాల్సిందే’ అని పేర్కొన్నారు. అంతేకాదు, రాజకీయ ప్రసంగాల కోసం ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయడానికి ముందు ముందూ వెనుకా పరిస్థితులను గమనించాల్సి ఉంటుందని, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని సమతూకంగా నిర్ణయం తీసుకోవాలని వివరించారు.
ఆ ప్రసంగాలు ఎన్నికల సమయంలో ఇచ్చారా? లేక వేరే సందర్భాల్లో ఇచ్చారా? అనేది కూడా పరిశీలించాలని న్యాయమూర్తి అన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చారంటే అది వేరని, కానీ, సాధారణ సమయంలోనూ అలాంటి ప్రసంగాలు చేస్తే అది కచ్చితంగా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఇచ్చారని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ప్రసంగాల్లో రాజకీయ నాయకులు ఎన్నో చెబుతుంటారని, ఒకరిపై ఇంకొకరు ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తుంటారని, అది తప్పు అని వివరించారు. కానీ, ఎవరేమీ మాట్లాడినా అందులోని నేరగుణాన్ని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు రాజకీయ నేతల వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేస్తే ఎన్నికల సమయంలో నేతలందరిపై 1000 ఎఫ్ఐఆర్‌లు నమోదవుతాయని పేర్కొన్నారు.
కాగా, అల్లర్ల సమయంలో వారు కావాలనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేశారని, గోలీ మారో సాలోం కో అని పిలుపు ఇచ్చారని బృందా కరత్ న్యాయవాది అన్నారు. అలాగే... ‘యె లోగ్’ (వీళ్లు) మీ ఇళ్లల్లోకి జొరబడి ఆడపిల్లలను ఎత్తుకెళ్లతారని, వారిని రేప్ చేస్తారనే మాటలూ అన్నారని పేర్కొన్నారు. ఇక్కడ యె లోగ్ అంటే ఎవరిని సూచిస్తున్నదని, అది కచ్చితంగా ఒక వర్గాన్నే సూచిస్తున్నదని ఎలా వాదిస్తారని కోర్టు ప్రశ్నించింది. అందుకు ఆధారాలేమీ లేవు కదా అని పేర్కొంది. వారు షహీన్ బాగ్ నిరసనను పేర్కొంటూ పై వ్యాఖ్యలు చేశారని కరత్ కౌన్సెల్ పేర్కొన్నారు. ఆ నిరసనను దేశమంతా మద్దతు ఇచ్చిందని, అలాంటప్పుడు ఒక వర్గానికే ఎలా అంటగడతారని కోర్టు అడిగింది.
ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
