విదేశీగడ్డపై భారత దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు. ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో ఆయన పార్లమెంటుకు వెళ్లుతున్నారు. తాను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. 

న్యూఢిల్లీ: యూకే పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత అక్కడ భారత దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రతిష్టతను దిగజార్చేలా మాట్లాడాడని అధికార బీజేపీ పార్లమెంటులో ఆరోపిస్తున్నది. విదేశీ గడ్డపై మన దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ పార్లమెంటులో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. అదానీ, హిండెన్ బర్గ్ రిపోర్టుపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్షాల డిమాండ్‌తో గత రెండు రోజులుగా కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తరుచూ వాయిదాలు పడుతున్నది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు వెళ్లుతుండంతో ఈ రోజు పార్లమెంటు సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ చేస్తున్న క్షమాపణల డిమాండ్‌ను రాహుల్ గాంధీ ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

పార్లమెంటుకు వెళ్లుతున్న రాహుల్ గాంధీ ఎన్డీటీవీతో కొన్ని నిమిషాలు మాట్లాడారు. తాను దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తెలిపారు. విదేశీ గడ్డపై మన దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపణలు చేస్తున్నదని, ఈ ఆరోపణలపై స్పందిస్తారా? అని అడగ్గా.. తాను పార్లమెంటులో మాట్లాడుతానని చెప్పారు. వారు (అధికారపక్షం) అనుమతిస్తే.. తాను పార్లమెంటులో ఈ ఆరోపణలకు సమాధానం చెబుతానని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విమర్శించే వ్యక్తి.. విదేశాలకు వెళ్లి తనకు భారత్‌లో మాట్లాడే స్వేచ్ఛ లేదని చెబుతున్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను ఇంకా ముంచినా తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. కానీ, ఆయన దేశాన్ని అవమానించాలని చూస్తే మాత్రం సహించబోమని వివరించారు.