మమతా బెనర్జీ జీ20 విందుకు వెళ్లకపోయినా ఆకాశం విరిగిపడకపోయేది - కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి
జీ20 సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆమె విందుకు హాజరుకాకపోయేని ఏమీ జరగకపోయేదని అన్నారు.

జీ20 సదస్సు సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకావడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఈ కార్యక్రమానికి హాజరుకావడం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమత వైఖరిని బలహీనపరుస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘ఆమె విందుకు హాజరు కాకపోయి ఉంటే ఏమీ జరిగేది కాదు. ఆకాశం పడిపోకపోయేది. మహాభారతం అపవిత్రం అయ్యేది కాదు. కురన్ కూడా అపవిత్రం అయ్యేది కాదు..’’ అని అధీర్ చౌధురి అన్నారు. మరి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరేదైనా కారణం ఉందా అని అని ఆయన ప్రశ్నించారు. డిన్నర్ టేబుల్ వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కన బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.
ఈ విందు కార్యక్రమానికి పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు హాజరుకాలేదని, కానీ మమతా బెనర్జీ హడావుడిగా ఢిల్లీ చేరుకున్నారని అధీర్ చౌధురి విమర్శించారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు విందు ఆహ్వానాన్ని బహిష్కరించారని గుర్తు చేశారు. ఈ విందుకు పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అయినా ఆమె ముందుగానే ఢిల్లీ చేరుకోవడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.
అయితే అధీర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ మాట్లాడుతూ.. పరిపాలనా కోణంలో అనుసరించాల్సిన కొన్ని ప్రోటోకాల్స్ గురించి చౌధురి తమకు స్పీచ్ ఇవ్వకూడదని అన్నారు. ప్రోటోకాల్ లో భాగంగా జీ20 విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లాలా ? వద్దా అని చౌధురి నిర్ఱయించలేరని అన్నారు. మమతా బెనర్జీ ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి రూపకర్త అని అందరికీ తెలుసని అన్నారు. ఆమె నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని సేన్ అన్నారు.
కాగా.. జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.