భారత్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. తాము రష్యాపై విధించిన ఆంక్షలను పక్కదారి పట్టేలా వ్యవహరించినా, రష్యా నుంచి చమురు, ఇతర సరుకుల దిగుమతుల్లో పెరుగదల కనిపించినా తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఒక వేళ భారత సరిహద్దుల్లోకి చైనా చొచ్చుకుని వచ్చినా అప్పుడు.. భారత్‌కు సహాయం చేయడానికి రష్యా ముందుకు రాదనీ పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై తాము విధించిన ఆంక్షలు పక్కదారి పట్టేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. రష్యా, చైనాల మధ్య పరిమితి లేని భాగస్వామ్యం ఉన్నదని తెలిపింది. భవిష్యత్‌లో చైనా మళ్లీ భారత భూభాగాల్లోకి చొచ్చుకురావాలని ప్రయత్నించకపోదు అని, అలా ఎల్ఏసీ దాటే ప్రయత్నం చేసినప్పుడు భారత్‌కు సహాయం చేయడానికి, అండగా నిలవడానికి రష్యా ముందుకు రాదని పేర్కొంది. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య అంతులేని భాగస్వామ్యం ఉందని అవి ప్రకటించుకున్నాయని గుర్తు చేసింది. కాబట్టి, రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను తప్పించేలా భారత్ వ్యవహరించరాదని పేర్కొంది. ఒక వేళ తాము రష్యాపై విధించిన ఆంక్షలను నీరుగార్చేలా ఏ దేశం వ్యవహరించిన అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ భారత్‌కు బుధవారం వచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఖండించకుండా తటస్థ వైఖరి అవలంభిస్తున్న భారత్‌పై పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆయన మన దేశంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు.
అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో చమురు, ఇతర నిత్యావసర సరుకులను అత్యల్ప ధరలకే ఎగుమతి చేయడానికి రష్యా దాని మిత్రదేశాలకు ఆఫర్లు ఇచ్చింది. భారత్‌కు చమురును చౌకగా అందిస్తామని ప్రకటించింది. దీనికి భారత ప్రభుత్వం కూడా సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ అంగీకారం అమెరికా ప్రభుత్వానికి గిట్టడం లేదు. భారత్ అంగీకారం తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడం లేదని, కానీ, ఆ నిర్ణయం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సమర్థించినట్టుగా ఉన్నదని పేర్కొంది.
అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ దలీప్ సింగ్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, రష్యా కరెన్సీ రూబుల్ ఆధారిత మెకానిజం అభివృద్ధి చెందడం లేదా డాలర్ ఆధారిత ఫైనాన్షియల్ సిస్టమ్ దిగజారడం, లేదా రష్యాపై అమెరికా విధించి ఆంక్షలు పక్కదారి పట్టేలా చేయడం వంటి వాటిని అమెరికా సహించదని స్పష్టం చేశారు. అదే సందర్భంలో రష్యా నుంచి భారత ఎగుమతులు ఏకకాలంలో పెరగడాన్ని కూడా అంగీకరిందచని వివరించారు. చమురు దిగుమతులు, అమెరికా నిషేధించిన ఇతర సరుకులను భారత్ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోరాదని తెలిపారు.
ఒక వేళ భారత్ చౌకగా లభించే చమురును రష్యా నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే.. లేదా అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలను భారత్ ఎదుర్కోవాల్సి వస్తుందని రిపోర్టర్లు యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ సింగ్‌ను అడిగారు. దీనికి సమాధానంగా అది వ్యక్తిగతంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన విషయాలు అని, ఆ ప్రైవేటు విషయాలను పబ్లిక్‌గా చెప్పలేమని తెలిపారు.
భారత్‌కు కావాల్సిన అదనపు చమురును అందించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదని, రక్షణ వ్యవస్థలోనూ వివిధ దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుని వైవిద్యాన్ని చూపెట్టే భారత్.. చమురు దిగుమతుల్లోనూ అదే దారి అనుసరించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉన్నది.
