అదే జరిగితే మేం కూడా కుల గణన చేపడతాం: ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బాఘేల్
బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, ఛత్తీస్‌గడ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంట కుల గణన చేపడతామని సీఎం భుపేశ్ బాఘేల్ హామీ ఇచ్చారు.

న్యూఢిల్లీ: బిహార్ కుల గణన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ఊహించినదానికన్నా భారీగా ఉన్నట్టు తేలింది. బిహార్ చేపట్టిన ఈ చారిత్రాత్మక కుల గణనను ఇతర రాష్ట్రాలూ పాటిస్తాయనే అంచనాలు నిజం అవుతున్నట్టు తెలుస్తున్నది. కుల గణన గురించి తాజాగా ఛత్తీస్‌గడ్ సీఎం కామెంట్ చేశారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ గడ్ రాష్ట్రం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన కుల గణన గురించి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చారు.
ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేస్తారని సీఎం భుపేశ్ బాఘేల్ తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కుల గణన చేపడుతామని పేర్కొన్నారు.
Also Read: అరగంటపాటు అక్రమంగా ఓ వ్యక్తిని లాకప్‌లో వేశారు.. పోలీసులకు రూ. 50 వేల ఫైన్ వేసిన హైకోర్టు
2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఇండియా అనే కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో కాంగ్రెస్‌తోపాటు నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బీహార్‌లో కుల గణన చేపట్టింది నితీశ్ కుమార్ ప్రభుత్వమే. చాలా మంది నితీశ్ కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కాగా, అధికార బీజేపీ మాత్రం విమర్శిస్తున్నది.