సారాంశం
Karnataka Assembly Election 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Promises Rs 10 Lakh Insurance For Fishermen: వచ్చే నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. అధికార పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. వివిధ పార్టీల నాయకులు నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి హామీల వర్షం కురుపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు.
ఇదే క్రమంలోనే బీజేపీపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ అమిత్ షాపై కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. "రెచ్చగొట్టే ప్రకటనలు, శత్రుత్వం, ద్వేషం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ" కాంగ్రెస్ నేతలు రణదీప్‌సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా, బీజేపీ ర్యాలీ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హింసాత్మక ఘటనలు జరుగుతాయని చెప్పి రాష్ట్ర ఓటర్లను బెదిరించిన కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఓటర్లను బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.