లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడానికి ముందు తనకు పెళ్లైనట్టు భాగస్వామికి చెప్పితే.. ఆ తర్వాత ఆమెతో విడిపోయినా దాన్ని మోసంగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఎందుకంటే.. ముందే పెళ్లైందన్న విషయాన్ని చెప్పినా భాగస్వామి అంగీకరించిందంటే.. ఆ సంబంధంలోని అనిశ్చితినీ ఆమె స్వీకరించినట్టేనని వివరించింది.
కోల్‌కతా: లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి దిగడానికి ముందే తాను అప్పటికే పెళ్లి చేసుకున్నట్టు చెబితే దాన్ని మోసం పరిగణించలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్నట్టు చెప్పినా ఆ రిస్క్‌ను లివ్ ఇన్ పార్ట్‌నర్ యాక్సెప్ట్ చేసినట్టుగా భావించానని వివరించింది. దిగువ కోర్టు ఓ హోటల్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించిన తీర్పును కొట్టేసింది. ఆ హోటల్ ఎగ్జిక్యూటివ్ తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వెనక్కి వెళ్లాడని పేర్కొంటూ దిగువ కోర్టు శిక్ష విధించింది.
చీటింగ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 415 ప్రకారం నిజాయితీ లేకుండా మోసపూరితంగా వ్యవహరించడం లేదా.. ఉద్దేశపూరితంగానే తప్పుదోవ పట్టించడం అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ రాయ్ చౌదరి తెలిపారు.
ఈ కేసు 2015కు చెందినది. ప్రగతి మైదాన్ పోలీసు స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆ కేసు వివరాల ప్రకారం, 2014 ఫిబ్రవరిలో ఆమె ఓ హోటల్‌లో జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడ ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌ను కలిసింది. ఆ మేనేజర్ ఆమెను ఫ్లర్ట్ చేశాడు. మొబైల్ నెంబర్ అడగ్గా.. ఆమె ఇచ్చింది. వారు తొలిసారి కలిసినప్పుడు తన విఫల వైవాహిక బంధం గురించి ఆమెకు చెప్పాడు. తనతో కలిసి జీవించాలని కోరగా.. ఆమె అంగీకరించింది.
Also Read: తాళం వేసిన సమాధి పాకిస్తాన్‌లో కాదు.. హైదరాబాద్‌లోనే: వైరల్ ఫొటో Fact Check (Video)
ఆ మహిళ తల్లిదండ్రులకు కూడా వారి సంబంధం గురించి తెలుసు. అయితే, తొందరగా పెళ్లి చేసుకోవాలని వారు కోరారు. కానీ, అతను తన భార్యతో విడాకుల ప్రక్రియను నెమ్మదిగా సాగించాడు. ఆ తర్వాత ఆమెను హోటల్ జాబ్ నుంచి తొలగించారు. ఏడాది తర్వాత ఆయన ముంబయి వదిలి తన భార్యను, కుటుంబాన్ని కలిశాడు. ఆ తర్వాత కోల్‌కతాకు తిరిగి వచ్చి ఆమెతో మాట్లాడాడు. తాను తన భార్యకు విడాకులు ఇచ్చే నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిపాడు. దీంతో తనను మోసం చేసినట్టుగా భావించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చీటింగ్, రేప్ ఆరోపణలు చేసింది.
ఆయన పెళ్లి చేసుకుంటాననే మాట మీదనే తాను ఆయనతో సంబంధంలోకి వెళ్లినట్టు ఆమె హైకోర్టుకు తెలిపింది. కానీ, ఆ హామీతో ఆయన విడాకుల అంశం ముడిపడి ఉంటుందని, విడాకులు ఒకరు స్వతహాగా తీసుకునే నిర్ణయం కాదని హైకోర్టు తెలిపింది. వీరిద్దరి సంబంధం ప్రారంభానికి ముందే ఆమెకు ఆ రిలేషన్‌షిప్‌లోని అనిశ్చితి తెలుసు అని కాబట్టి, నిందితుడు ఆమెకు నిజాలు తెలియకుండా దాచి మోసం చేశాడని చెప్పలేమని వివరించింది. అబద్ధాలతో ఆమెను వాడుకోవాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నదని నిరూపించలేమని తెలిపింది.
