న్యూఢిల్లీ: కరోనావైరస్ లేదా కోవిడ్ -19 విస్తరిస్తున్న నేపథ్యంలో 19 నుంచి 31 మధ్య జరగాల్సిన అన్ని పరీక్షలను ఐసిఎస్ఈ, ఐఎస్సీ మండలి వాయిదా వేసింది. పరిస్థితి మెరుగుపడిన తర్వాత కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు మండలి తెలిపింది.

కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో, అస్థిర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది ఆరోగ్యం కోసం పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది. 2020 సంవత్సరానికి గాను మార్చి 19, మార్చి 31వ తేదీ మధ్య జరగాల్సిన అన్ని ఐసిఎస్ఈ, ఐస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది.

వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను తగిన సమయంలో ప్రకటిస్తామని మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్, కార్యదర్శి గెర్రీ అరథూన్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 19, మార్చి 31వ తేదీన జరగాల్సిన సీబీఎస్సీ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. 10, 12వ తరగతి పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. 

మార్చి 31 తేదీ వరకు అన్ని పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను,త ఇతర సంస్థలను మూసేయాలని, ఈలోగా జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఈ నెల 20వ తేదీన, 12వ తరగతి పరీక్షలు మార్చి 30వ తేదీలోగా ముగిసే విధంగా షెడ్యూల్ చేశారు. కొత్త తేదీలను మార్చి 31వ తేదీ తర్వాత ప్రకటించనున్నారు.

దేశంలో కరోనావైరస్ పాజిటివ్ 169 నమోదయ్యాయి. కరోనా వైరస్ వల్ల ముగ్గురు మరణించారు.