Monkeypox Virus: భయపడాల్సినవసరం లేదు.. కానీ, ఈ లక్షణాలు ఉంటే.. : ICMR
Monkeypox Virus: భారతదేశంలో ఇప్పటివరకూ మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు కాలేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శుక్రవారం ధృవీకరించింది. వ్యాధిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించింది. వ్యాధి లక్షణాలు ఉంటే.. పరీక్ష చేయించుకోవాల్సిందిగా సూచించింది.
Monkeypox Virus: కరోనా మహమ్మారి (Coronavirus) పీడ విరుగడ అయ్యిందని.. కాస్త ఊపశమనం పొందుతున్న వేళ మరో వేరియంట్ యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అదే మంకీపాక్స్ (Monkeypox Virus). ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. మంకీపాక్స్ వైరస్ ఇప్పటివరకు 19 దేశాలకు విస్తరించింది. తాజాగా ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 230 పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మంకీపాక్స్ (Monkeypox Virus) పీయర్ భారత్ ను కూడా పట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలను కేంద్రప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే.. భారతదేశంలో ఇప్పటివరకూ మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు కాలేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శుక్రవారం ధృవీకరించింది. వ్యాధిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించింది.
ఈ నేపధ్యంలో మంకీపాక్స్‌పై IMCR శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ.. USA , యూరప్‌లో మంకీపాక్స్ వైరస్(Monkeypox Virus) కేసులు బయటపడుతున్నాయని, భారత్‌లో ఇప్పటివరకూ వైరస్ కేసులు వెలుగుచూడలేదని ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ స్పష్టం చేశారు.
లక్షణాల గురించి మాట్లాడుతూ.. "మంకీపాక్స్ సోకితే.. సాధారణంగా తీవ్ర జ్వరం, చాలా తీవ్రమైన శరీర నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయని, శరీరంపై దద్దుర్లు 2-3 రోజుల తర్వాత కనిపిస్తాయని తెలిపారు. సాధారణంగా ఆ వైరస్ రోగికి చాలా దగ్గరగా ఉన్న వారికే ఈ వ్యాధి ప్రబలుతోందని చెప్పారు. మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాలకు ప్రయాణ చరిత్ర ఉన్నవారు. ఈ రకమైన విలక్షణమైన లక్షణాలు ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. మంకీపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ICMR శాస్త్రవేత్త నొక్కిచెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ 20 కంటే ఎక్కువ దేశాలకు వ్యాపించింది, దాదాపు 200 ధృవీకరించబడిన కేసులు. అలాగే.. 100 కంటే ఎక్కువ అనుమానిత కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ముందుగా మే 7న UK లో తొలి మంకీపాక్స్ కేసు నిర్థారణ కాగా.. ఇటీవల ఉత్తర అమెరికా, యూరప్‌ల్లోనూ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్‌కు చెందినదని, ఈ వైరస్ బారినపడిన రోగులు కొన్ని వారాల్లోనే కోలుకుంటారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు.