న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో  ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఏపీలో డిప్యూటేషన్‌పై పని చేసేందుకు  అవకాశం కల్పించాలని  ఆమె కోరారు. ఇప్పటికే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రితో ఆమె ఇవాళ భేటీ అయ్యారు.

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత ఆయనతో ఆమె భేటీ అయ్యారు. ఏపీలో పని చేస్తానని ఆమె చెప్పారు.

సీఎం జగన్ కూడ ఆమె పనిచేసేందుకు అంగీకరించారు.  ఈ మేరకు ఏపీ క్యాడర్‌ బదలాయించేందుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కానీ ఈ విషయమై కేంద్రం నుండి స్పందన రాలేదు.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని  ఆమె తలపెట్టారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చొరవతో ఐఎఎస్ శ్రీలక్ష్మి మంగళవారం నాడు పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.

తెలంగాణ కేడర్ నుండి ఏపీ కేడర్‌కు బదిలీ చేయాలని కోరారు. డీఓపీటీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటున్నందున ఐఎఎస్ శ్రీలక్ష్మి  అమిత్ షా ను కలిశారు.