ప్రస్తుతం  దేశవ్యాప్తంగా  మీటూ ఉద్యమం కొనసాగుతోంది. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమను లైంగికంగా వేధించిన మృగాళ్ల గురించి బైటపెడుతున్నారు. దీంతో సినీ, క్రీడా వ్యాపార రంగాలతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఈ ఉద్యమం అందించి ధైర్యంతో మరింత మంది మహిళలు ముందుకు వచ్చి తమపై జరుగుతున్న అకృత్యాలను బైటపెడుతున్నారు.

అయితే అత్యున్నత పదవుల్లో ఉన్న మహిళలు కూడా ఈ వేధింపులకు గురవుతున్నారు. అలాంటి సంఘటనే పంజాబ్ లో బైటపడింది. ఓ మంత్రి తనను లైంగికంగా  వేధిస్తున్నాడని ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి ఏకంగా పంజాబ్ ముఖ్యమంత్రికే పిర్యాదు చేసింది. సదరు మంత్రి తనపై గత కొంత  కాలంగా వేధింపులకు  పాల్పడుతున్నట్లు...ఇటీవల కాలంలో ఆ వేధింపులు ఎక్కువయ్యాయని సదరు బాధిత  అధికారిణి ముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. తనకు ఆ మంత్రి పంపిన అసభ్యకరమైన మెసేజ్ లను సీఎంకు చూపించి అతడి నుండి తనను కాపాడాలని బాధితురాలు వేడుకుంది.

అయితే ఆ మంత్రి అంత అల్లాటప్పా నాయకుడు కాదని తెలుస్తోంది. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అతడు అత్యంత సన్నిహితుడు కావడంతో అతడిపై చర్యలుంటాయా? లేక క్షమాపనతోనే సరిపెడతారా? అన్న చర్చ జరుగుతోంది.  బాధితురాలి పిర్యాదుపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం...ఈ వ్యవహారానికి సంబంధించిన విషయాలేవీ బైటకు రాకుండా జాగ్రత్త పడ్డటం చూస్తుంటే అతడిపై చర్యలు తీసుకోవడం అనుమానంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.