అథ్లెట్లను స్టేడియం నుంచి తరిమేసి, కుక్కతో వాకింగ్... ఐఏఎస్ అధికారిణికి బలవంతపు రిటైర్మెంట్..
కుక్కతో వాకింగ్ చేయడం కోసం స్పోర్ట్స్ స్టేడియం నుంచి అథ్లెట్లను ముందుగానే తరిమేసిన ఐఏఎస్ అధికారిణిపై బలవంతపు రిటైర్మెంట్ వేటు పడింది.

ఢిల్లీ : తన కుక్కను వాకింగ్ కు తీసుకు వెళ్లేందుకు జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే గవర్నమెంట్ స్టేడియం నుండి అథ్లెట్లను బయటకు పంపించింది ఓ మహిళా ఐఏఎస్ అధికారి. ఈ విషయం వివాదంగా మారడంతో ఆ అధికారిణిపై వేటుపడింది. సదరు ఐఏఎస్ 1994 బ్యాచ్ కు చెందిన రింకూ దుగ్గా (54).
ఆమె మీద ఈ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం బలవంతంగా రింకుదుగ్గా కు రిటైర్మెంట్ ఇచ్చి పంపించింది. ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించినందుకుగాను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ ప్రభుత్వం ఆమెకు ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆమెకు బుధవారం ఆదేశాలు అందాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు, ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
Siddaramaiah| అప్పులు చేసి.. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: సీఎం సిద్ధరామయ్య
ఏ ప్రభుత్వ ఉద్యోగి నైనా సరే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయా ప్రభుత్వాలు ముందస్తుగానే పదవీ విరమణ చేయించే హక్కు కలిగి ఉంటాయి. రింకూ దుగ్గా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లోని సంచార జాతుల వ్యవహారాల విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ విధులు లద్ధాఖ్ లో నిర్వహిస్తున్నారు.
అసలు ప్రభుత్వం ఇంతటి కఠినమైన నిర్ణయానికి రావడం వెనక ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణంగా సాయంత్రం ఏడు గంటల వరకు జాతీయస్థాయి క్రీడాకారులు, ఔత్సాహిక క్రీడాకారులు.. వారికి శిక్షణ ఇచ్చే ట్రైనర్లతో బిజీ బిజీగా ఉంటుంది. రింకూ దుగ్గా, సంజీవ్ ఖిర్వార్ ఐఏఎస్ దంపతులు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఈ జంట ఏడాది కిందట ఈ స్టేడియంలో తమ కుక్కతో వాకింగ్ చేసేందుకు రావడం మొదలుపెట్టారు.
అయితే, వీరు వాకింగ్ చేయడానికి.. అట్ల హడావుడి చిరాగ్గా ఉండడంతో.. ఆదేశాల మేరకు…నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి బయటికి వెళ్ళగొట్టేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఈ ఐఏఎస్ అధికారులు ఇద్దరు పెంపుడు కుక్కతో స్టేడియంకి వచ్చి తాపీగా, వాకింగ్ చేసుకుంటుండేవారు. ఇలాంటి విషయాలు ఊరికే ఉండవు కదా… మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం నిరుడు మే స్పందించింది. భార్యాభర్తలిద్దరిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. తాజాగా రింకూ దుగ్గాపై వేటు పడింది.