ఆయన ఓ ఉన్నత స్తానంలోఉన్న అధికారి. అలాంటి వ్యక్తి ఓ మహిళ పై కన్నేశాడు. తాను కలెక్టరేట్ లో ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ ఐఏఎస్ అధికారి ఆయన కార్యాలయంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన భర్తను తొలగిస్తానని బెదిరించి ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆమె ఆరోపించింది. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జనక్ ప్రసాద్ పాఠక్‌పై ఈ మేరకు నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది. 

పాఠక్ గత నెల 26న జంగజీర్ చాంఫ్ నుంచి భూ రికార్డుల డైరెక్టర్‌గా రాయ్‌పూర్‌కు బదిలీ అయ్యారు. కాగా మే 15న అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పాఠక్ తనను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. ఆయన తనకు అసభ్య సందేశాలు పంపుతున్నారంటూ వాటి తాలూకు స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ వ్యవహరం ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ దృష్టికి వెళ్లడంతో పాఠక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసు విచారణ కోసం సీఎం ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించినట్టు అధికారులు వెల్లడించారు.