ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమా షోలేను గుర్తుచేస్తూ తనను గబ్బర్ సింగ్‌తో పోల్చుకున్నారు. వంద కిలోమీటర్ల దూరంలోనైనా అవినీతికి పాల్పడుతున్నారంటే.. అప్పుడు తల్లి తన బిడ్డతో పడుకోమంటుందని,లేదంటే కేజ్రీవాల్ వస్తాడని చెబుతందని పేర్కొన్నారు. తాను అవినీతిని అంతం చేసే టెర్రరిస్టును అని చెప్పారు.
న్యూఢిల్లీ: ఆప్(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈ రోజు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బాలీవుడ్ సినిమా(Bollywood Movie) షోలే(Sholay) సినిమాను గుర్తు చేస్తూ.. అందులోని విలన్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్‌తో తనను పోల్చుకున్నారు. వంద కిలోమీటర్ల దూరంలో ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే.. ‘బిడ్డ పడుకో.. లేదంటే, కేజ్రీవాల్ వస్తాడు’ అని ఆ తల్లి చెబుతుందని షోలే సినిమాలో గబ్బర్ సింగ్ గురించి చెప్పే మాటలను ఉటంకించారు. అదే విధంగా బీజేపీపై పలు విమర్శలు సంధించారు. ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఇతర పార్టీలతో తాము చేతులు కలుపుతామని వివరించారు.
బీజేపీ అధికారంలోకి రాకుండా తాము వేరే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కేజ్రీవాల్ అన్నారు. కాబట్టి, గెలుచుకునే సీట్ల గురించి ఆలోచించవద్దని తెలిపారు. కాబట్టి, మీరు ఆప్ పార్టీకి ఎంతో ఉత్సాహంగా ఓటేయండని కోరారు. లక్నోలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఆప్‌కు వేర్పాటువాద ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయని ఆప్ మాజీ నేత, హిందీ కవి కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపైనా కేజ్రీవాల్ స్పందించారు. ఘజియాబాద్‌కు చెందిన ఓ కవి కేజ్రీవాల్‌ను ఒక టెర్రరిస్టుగా కలగన్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన మాటలపై అంత విశ్వాసం ఉంటే.. ఇక ప్రధాని మోడీ, ఇతర సంస్థలు ఎందుకు అని ప్రశ్నించారు. అలాగైతే, ప్రధాని మోడీ, ఆర్ఏడబ్ల్యూ, ఎన్ఐఏ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఎందుకు.. వాటన్నింటినీ రద్దు చేయండి మరి..? అంటూ ఆగ్రహించారు. ఆ కవే.. ఎవరు టెర్రరిస్టు.. ఎవరు కాదో చెబుతారని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో ఆయన షోలే సినిమాను గుర్తు చేశారు. వంద కిలోమీటర్ల దూరంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే.. బిడ్డ నిద్రపో.. లేదంటే కేజ్రీవాల్ వస్తాడు అంటూ తల్లి తన బిడ్డకు చెబుతుంది అంటూ పేర్కొన్నారు. అవినీతిని అంతం చేసే టెర్రరిస్టు తాను అని అన్నారు. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 70 ఏళ్లుగా మంచిగా పని చేసి ఉంటే నేడు వారి కష్టంపై ఓట్లు అడిగేవారని, కానీ, అలాంటి పనులేవీ చేయలేదు కాబట్టే.. వాళ్లు కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఈ రోజు హర్ధోయ్ లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రధాని మోడీ.. సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ, దాని ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అఖిలేష్ యాదవ్.. మోడీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం అంటూ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 3వ దశ పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో హర్దోయ్‌లో జరిగిన ర్యాలీకి ప్రధాని మోడీ హాజరయ్యారు. అక్కడ 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. ఆ దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారనీ, కోర్టు ఇటీవల దోషులకు మరణశిక్ష విధించిందని పేర్కొన్నారు. "అహ్మదాబాద్ పేలుళ్ల కేసు విచారణ జరుగుతున్నందున ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. ఈ రోజు, కోర్టు వారికి శిక్ష విధించింది. ఈప్పుడు నేను దేశం ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. పేలుళ్లలో, బాంబులను సైకిళ్లపై ఉంచారు... వారు [ఉగ్రవాదులు] ఎందుకు సైకిళ్లను ఎంచుకున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను" అని మోడీ అన్నారు. ఎస్పీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన పార్టీ చిహ్నాంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం అని అన్నారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. "మా సైకిల్ రైతులతో పొలాలను కలుపుతుంది. వారి శ్రేయస్సుకు పునాది వేస్తుంది. మా చక్రం సామాజిక సరిహద్దులను ఛేదిస్తుంది. కుమార్తెలను పాఠశాలకు పంపుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
