టిక్ టాక్ లో వీడియోలు చేసి క్రేజ్ సంపాదించుకున్న సోనాలీ... ఇటీవల బీజేపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆమె హర్యానా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ లో లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్న ఆమెకు ఆమెకు హర్యానా రాష్ట్రంలో ఆడంపూర్ నియోజకవర్గం టికెట్ బీజేపీ నుంచి దక్కించుకుంది.

ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏది మాట్లాడినా... ఇట్టే వైరల్ అయిపోతోంది. తాజాగా ఆమె ప్రచారంలో భాగంగా... ప్రజలను ఉద్దేశించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అదే నినాదాన్ని సభకు వచ్చిన ప్రజలను కూడా చేయాలని కోరారు. అయితే... కొందరు యువకులు ఆమె చెప్పినట్లు భారత్ మాతాకీ జై నినాదాలు చేయలేదు. దీంతో...ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అక్కడితో ఆగకుండా...మీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా అంటూ ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా ఆ నినాదం చేయని వారి ఓటుకి అసలు విలువ లేదు అంటూ ఆమె కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ "భారత్ మాతాకి జై" అనే నినాదం చేశారు ఫోగాట్. ఆ నినాదాన్ని గట్టిగా పలకలేనప్పుడు సిగ్గుపడాలి అని ఆమె అన్నారు. అంతేకాదు అక్కడ గట్టిగా నినాదాన్ని పలకనివారిని ఉద్ధేశిస్తూ.."మీరంతా పాకిస్తాన్ నుండి వచ్చారా? మీరు పాకిస్తానీలా? కాదు కదా? మీరు భారతీయులైతే భారత్ మాతా కి జై అని చెప్పండి" అంటూ ఆమె అన్నది.

కొంతమంది అప్పటికి కూడా నినాదం పలకకపోవడంతో "భారత్ మాతాకి జై అని పలకలేనివాళ్లు సిగ్గు పడాలని, రాజకీయాల కోసం భారత్ మాతాకి జై అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు" అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అక్టోబర్ 21వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయిపై ఆమె ఆడంపూర్‌లో పోటీ చేస్తున్నారు.