దేశరక్షణలో భాగంగా శత్రుదేశపు యుద్ధ విమానాన్ని కూల్చి.. చివరికి శత్రువులకు చిక్కినా... ఎక్కడా మనస్థైర్యం కోల్పోలేదు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. దేశభద్రతకు సంబంధించిన కీలక రహస్యాలను శత్రు సైన్యానికి చెప్పకుండా ఆయన కనబరిచిన ధైర్యానికి భారతీయులు జేజేలు పలుకుతున్నారు.

దీంతో ఆయన దేశ ప్రజలకు ఒక హీరోగా మారిపోయారు. సహజంగానే హీరోల హెయిర్, డ్రెస్సింగ్, సేవింగ్‌లను అనుసరించే అభిమానులు...ఇప్పుడు అభినందన్ మీసానికి ఫిదా అయిపోయారు.

దీంతో దేశంలోని చాలా సెలూన్ షాపుల్లో అభినందన్ మీసకట్టు కావాలంటూ యూత్ ఎగబడుతున్నారు. అభినందన్ స్టైల్లో మీసం చేయించుకున్న వారు దానిని సోషల్ మీడియాలో పెడుతుండటంతో అది వైరల్ అవుతోంది.

దీంతో ఒకరిని చూసి మరోకరు దీనిని అనుకరిస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి బెంగళూరు, పంజాబ్ వంటి ప్రాంతాల్లో పలు సెలూన్లు అభినందన్ హెయిర్‌కట్‌కు, మీసకట్టుకు భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి.