ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన ఘనత.. కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్, సక్సెస్‌ఫుల్‌గా దిగిన సీ 130జే
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక రవాణా విమానాల్లో ఒకటైన సీ 130 జే ని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో తొలిసారిగా రాత్రిపూట విజయవంతంగా ల్యాండింగ్ చేసింది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక రవాణా విమానాల్లో ఒకటైన సీ 130 జే ని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో తొలిసారిగా రాత్రిపూట విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల ప్రకారం.. ప్రయాణించే మార్గంలో టెర్రైన్ మాస్కింగ్‌ని ఉపయోగించడంతో కూడిన ఈ ఆపరేషన్‌లో గరుడ్ కమాండోల శిక్షణ మిషన్‌ను సజావుగా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎక్స్‌లో షేర్ చేసింది. యుద్ధం సహా అత్యవసర పరిస్థితుల్లో వీలైనంత త్వరగా కమాండోలను ఎలా మోహరించాలని అనేది కమాండోల శిక్షణలో ఒక భాగం.
‘ఇటీవలే ఐఏఎఫ్ సీ 130జే విమానాన్ని తొలిసారిగా కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రివేళ విజయవంతంగా ల్యాండ్ చేశామని ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. అయితే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించిన వివరాలను మాత్రం ఐఏఎఫ్ వెల్లడించలేదు. నిజానికి కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌లో విపరీతమైన చలి వాతావరణం వుంటుంది. కానీ భారతదేశ భద్రతకు సంబంధించి ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. కార్గిల్ హిమాలయాల్లో 8 వేల అడుగుల ఎత్తులో వుంది. అలాంటిది ఏకంగా సీ 130జే సూపర్ హెర్య్కులస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది.
ఈ వ్యూహాత్మక ప్రదేశంలో నైట్ ల్యాండింగ్‌ని విజయవంతంగా అమలు చేయడం భారత వైమానిక దళం మెరుగైన సామర్ధ్యాలను ప్రదర్శించడమే కాకుండా సవాళ్లతో కూడిన భూభాగాల్లోనూ పోరుకు సై అని ప్రపంచానికి హెచ్చరికలు పంపినట్లయ్యింది. సూడాన్ అంతర్యుద్ధం సమయంలో ఐఏఎఫ్ సీ 130 జే సూపర్ హెర్య్కులస్ విమానాన్ని గతేడాది ఏప్రిల్‌లో ఉపయోగించారు. అప్పుడు కూడా నైట్ ల్యాండింగ్ నిర్వహించిన ఐఏఎఫ్ తన సత్తాను చాటుకుంది. రాత్రి 8 గంటలకు జెడ్డా నుంచి బయలుదేరి సీ 130జేలో ఇద్దరు పైలట్లు, ఒక నావిగేటర్ , ఒక ఫ్లైట్ గన్నర్, ఒక ఇంజనీర్, ముగ్గురు సాంకేతిక సిబ్బంది వున్నారు. అలాగే 8 మంది గరుడ్ కమాండోలు కూడా వారి వెంట వున్నారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ పరికరాలు, వ్యూహాత్మక ఫ్లాష్‌లైట్‌లతో కూడిన బృందం రాత్రి ఆపరేషన్‌ను ఖచ్చితత్వంతో విజయవంతంగా అమలు చేసింది.
ఇకపోతే.. ఐఏఎఫ్ వద్ద ప్రస్తుతం 12 సీ 130జే విమానాలు వున్నాయి. హిండన్‌లోని 77వ స్క్వాడ్రన్, పనాగర్‌లోని 87 వింగ్స్ ఆఫ్ వాలర్ స్క్వాడ్రన్ నుంచి ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన సీ 130జే అత్యంత అధునాతన ఎయిర్‌లిఫ్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. యూఎస్ ప్రభుత్వ విదేశీ సైనిక విక్రయాల కార్యక్రమం కింద భారత్ దీనిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం మన దేశ అవసరాలు, పరిస్ధితులకు అనుగుణంగా సీ 130జేలో మార్పులు చేర్పులు చేశారు. ఏరియల్ రీఫ్యూయలింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ, పారాడ్రాప్, ఎలక్ట్రానిక్ నిఘా, వాతావరణ నిఘా వంటి అనేక రకాల మిషన్లను ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వర్తిస్తుంది.