ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన ఎయిర్ లిఫ్టింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచుకుంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత 68,000 మందికి పైగా  సైనికులు, దాదాపు 90 ట్యాంకులు , ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను తూర్పు లడఖ్‌కు తరలించింది . 

భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత 68,000 మందికి పైగా సైనికులు, దాదాపు 90 ట్యాంకులు , ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను భారత వైమానిక దళం తూర్పు లడఖ్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేయడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. తన Su-30 MKI , జాగ్వార్ జెట్‌లను ఐఏఎఫ్ ఈ ప్రాంతంలో మోహరించింది. శత్రు సమూహానికి సంబంధించి రౌండ్-ది-క్లాక్ నిఘా , సమాచార సేకరణ కోసం ఈ ప్రాంతంలో ఇతర వ్యవస్థలను కూడా దించింది. 

ప్రత్యేక ఆపరేషన్ కింద LAC వెంబడి నిర్మానుష్య ప్రాంతాలలో త్వరితగతిన బలగాలను మోహరించడం కోసం IAF , నౌకాదళం ద్వారా దళాలు , ఆయుధాలను రవాణా చేశారు. తద్వారా ఎయిర్ ఫోర్స్ వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యం ఎలా పెరిగిందో హైలైట్ చేస్తూ సైనిక వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా చైనా కార్యకలాపాలపై డేగ కళ్ల నిఘా ఉంచడానికి ఐఏఎఫ్ గణనీయమైన సంఖ్యలో రిమోట్‌ ద్వారా ఆపరేట్ చేసే పైలట్ రహిత విమానాలను ఈ ప్రాంతంలో మోహరించిందని అధికారులు తెలిపారు. 

తాజాగా IAF ఎయిర్‌క్రాఫ్ట్ భారత సైన్యంలోని పలు విభాగాల్లోని మొత్తం 68,000 మంది సైనికులు, 90కి పైగా ట్యాంకులు, దాదాపు 330 BMP పదాతిదళ పోరాట వాహనాలు, రాడార్ సిస్టమ్‌లు, ఫిరంగి తుపాకులు ఇతర పరికరాలను తూర్పు లడఖ్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేసింది. C-130J సూపర్ హెర్క్యులస్ , C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కలిగి ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రవాణా విమానాల మొత్తం లోడ్ 9,000 టన్నులు. 2020 నాటి గాల్వాన్ ఘర్షణల తరువాత రాఫెల్, మిగ్-29 విమానాలతో సహా అనేక ఫైటర్ జెట్‌లను గగనతల గస్తీ కోసం మోహరించబడ్డాయి. అయితే ఐఏఎఫ్ హెలికాప్టర్లు ముందుగా నిర్మించిన నిర్మాణాలు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాల విడిభాగాలను పర్వతాల్లోని స్థావరాలకు కూడా రవాణా చేసి సేవలను అందించాయి.

Su-30 MKI, జాగ్వార్ ఫైటర్ జెట్‌ల నిఘా పరిధి దాదాపు 50 కి.మీల వరకు ఉందని .. ఇవి చైనా దళాల స్థానాలు , కదలికలను ఖచ్చితంగా పర్యవేక్షించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వివిధ రాడార్‌లను ఇన్‌స్టాల్ చేసి ఈ ప్రాంతంలోని ఎల్ఏసీ వెంట ఉన్న ఫ్రంట్‌లైన్ స్థావరాలకు ఉపరితలం నుండి గైడెడ్ ఆయుధాల శ్రేణిని తీసుకురావడం ద్వారా ఐఏఎఫ్ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను, పోరాట సంసిద్ధతను త్వరగా పెంచుకుందని వారు తెలిపారు. సైనిక సత్తాను పటిష్టం చేయడం, విశ్వసనీయ బలగాలను నిర్వహించడం , ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శత్రు సమూహాన్ని పర్యవేక్షించడం ఈ వ్యూహంలో భాగమని ఆయా వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్ ప్లాట్‌ఫారమ్‌లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశాయని.. వారి మిషన్ లక్ష్యాలన్నింటిని పూర్తి చేసిందని నివేదికలు తెలిపాయి. 'ఆపరేషన్ పరాక్రమ్' సమయంలో ఉన్న దానితో పోలిస్తే మొత్తం ఆపరేషన్ ఐఏఎఫ్ పెరుగుతున్న ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. 

డిసెంబర్ 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి తర్వాత, భారత్ 'ఆపరేషన్ పరాక్రమ్'ను ప్రారంభించింది. దీని కింద నియంత్రణ రేఖ వెంబడి భారీ సంఖ్యలో సైనికులను సమీకరించింది. తూర్పు లడఖ్‌లో ఇండో చైనా సైనికుల ముఖాముఖి తర్వాత దాదాపు 3,500 కి.మీ పొడవైన ఎల్ఏసీతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగినప్పటి నుండి సైన్యం తన పోరాట సామర్థ్యాలను పెంచుకోవడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంబడి పర్వత ప్రాంతాలలో సులభంగా రవాణా చేయగల M-777 అల్ట్రా-లైట్ హోవిట్జర్‌లను గణనీయమైన సంఖ్యలో మోహరించింది.

M-777ని చినూక్ హెలికాప్టర్లలో త్వరగా రవాణా చేయవచ్చు . సైన్యం ఇప్పుడు తక్షణ అవసరాల ఆధారంగా వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి త్వరగా తరలించే సౌలభ్యాన్ని కలిగి ఉంది. భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోని తన యూనిట్‌లకు గణనీయమైన సంఖ్యలో US-తయారు చేసిన ఆల్-టెర్రైన్ వాహనాలు, ఇజ్రాయెల్ నుండి సమకూర్చుకున్న 7.62MM నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ సహా అత్యాధునిక ఆయుధాలను అందించింది.

కాగా.. విస్తృతమైన దౌత్య , సైనిక చర్చల తరువాత ఇరుపక్షాలు అనేక ప్రాంతాల నుండి సైనిక ఉపసంహరణను పూర్తి చేసినప్పటికీ, తూర్పు లడఖ్‌లోని కొన్ని ఘర్షణ పాయింట్లలో భారత్, చైనా దళాలు ఇప్పటికీ ఘర్షణ పడుతూనే వున్నాయి. అటు గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో ఎల్ఏసీ వెంట ఇరుపక్షాల వైపు దాదాపు 50,000 నుండి 60,000 మంది సైనికులు ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఇరుపక్షాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. మిగిలిన ఘర్షణ పాయింట్ల నుండి దళాలను త్వరగా ఉపసంహరించాలని భారతదేశం చైనాపై ఒత్తిడి చేయనుంది.

జూలై 24న, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్‌ సమావేశం సందర్భంగా చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీని కలిసిన సంగతి తెలిసిందే. మే 5, 2020న పాంగోంగ్ లేక్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది.