న్యూఢిల్లీ: పీఓకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రైక్స్ ‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో మంగళవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలకు సుష్మాస్వరాజ్ వివరించారు..  ఈ సమావేశంలో కేంద్ర  మంత్రులు  రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ, విజయ్ గోయల్‌తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నేతలు సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజార్, ఒమర్ అబ్దుల్లా, డి. రాజా తదితరులు పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు దారితీసిన పరిస్థితులను వివరించనున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చారనే విషయాన్ని కూడ ఈ సమావేశంలో కేంద్రం విపక్షాలకు వివరించింది.

పాక్‌లోని జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న భారత వైమానిక అధికారులను కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ అభినందించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్  మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.

ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకుండా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడంపై  ఆజాద్ భారత వైమానిక దళాన్ని అభినందనలతో ముంచెత్తారు.ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే ఏ చర్యకైనా తాము మద్దతుగా నిలుస్తామని సీపీఐ నేత డి.రాజా స్పష్టం చేశారు. 

అన్ని పార్టీలు కూడ భారత వైమానిక దళం దాడిని అభినందించాయి.  ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం, భద్రతా బలగాలు చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం పట్ల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.